Pathaan | బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, దీపికా పదుకొణే జంటగా నటించిన పఠాన్ మూవీ వచ్చే ఏడాది జనవరి 25వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల కంటే ముందే వివాదంలో చిక్కుకుంది. సోమవారం విడుదలైన బేషరమ్ రంగ్ సాంగ్ పట్ల కమలనాథులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాటలో దీపికా పదుకొణే ధరించిన కాస్ట్యూమ్‌పై మండిపడుతున్నారు. అంతే కాదు ఆమె కాషాయం రంగులో ఉన్న డ్రెస్సు ధరించిందని, ఆ మూవీని నిషేధించాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు. బైకాట్ పఠాన్ అనే హ్యాష్ ట్యాగ్‌ను బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
జనవరి 25వ తేదీన విడుదల కాబోయే పఠాన్ మూవీపై నిషేధం విధించాలని తాజాగా మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తం మిశ్రా డిమాండ్ చేశారు. ఈ మూవీలో కాషాయ దుస్తులను వాడటం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో కొన్ని అభ్యంతరకర సీన్లు ఉన్నాయని, ఈ సీన్లను మార్చనిపక్షంలో మధ్యప్రదేశ్‌లో పఠాన్ మూవీని బ్యాన్ చేస్తామని హెచ్చరించారు.
దీపికా, షారుక్ ఖాన్ దిష్టిబొమ్మలు దగ్ధం..
వీర్ శివాజీ గ్రూప్‌నకు చెందిన కార్యకర్తలు బేషరమ్ రంగ్ సాంగ్ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాటలోని కంటెంట్ వల్ల హిందూ సమాజం తీవ్ర మనస్తాపం చెందుతుందన్నారు. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్, దీపికా పదుకొణే దిష్టిబొమ్మలను వీర్ శివాజీ గ్రూప్ కార్యకర్తలు దగ్ధం చేసి నిరసన తెలిపారు.