Telangana | హీటెక్కిస్తున్న-టచ్ పాలిటిక్స్

రాష్ట్రంలో మొన్న ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగిన వేడి పార్లమెంట్ ఎన్నికలొచ్చినా చల్లారడం లేదు

  • Publish Date - April 19, 2024 / 03:52 PM IST

ఎమ్మెల్యేల ఫిరాయింపులే ఎజెండా
తెలంగాణలో ఇదే హాట్ టాపిక్
సర్కారు కూలుతుందన్న బీఆరెస్,బీజేపీ
ఫిరాయింపులు చేపట్టిన కాంగ్రెస్
అవహేళను గురైతున్న ప్రజా తీర్పు
బీజేపీ, బీఆరెస్, కాంగ్రెస్ లదే బాధ్యత

విధాత ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో మొన్న ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగిన వేడి పార్లమెంట్ ఎన్నికలొచ్చినా చల్లారడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేపట్టినప్పటి నుంచి సర్కారు కూలిపోతోందని బీఆరెస్,బీజపీ ముఖ్యనాయకుల శాపనార్ధాలు ప్రారంభమయ్యాయి. వరంగల్ కేంద్రంగా ప్రారంభమైన సెగలు, పగలు కొనసాగుతూ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణలో పాపులర్ డైలాగ్ గా ` మీ పార్టీ ఎమ్మెల్యేలు` మా పార్టీతో…అందులో నాతో టచ్ లో ఉన్నారంటూ చెప్పుకోడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది.

కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్ ముఖ్యనాయకుల నోటివెంట మీ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీతో టచ్ లో ఉన్నారు. నేడో రేపో చేరిపోతారు. మీ పార్టీ ఎమ్మెల్యేలను ఖాళీ చేయడం చిటికెలో పని అంటూ డైలాగులు పేల్చడం పరిపాటిగా మారింది. తిరిగి మేము అధికారంలోకి వస్తామంటూ బీఆరెస్, బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో ఈ డైలాగ్ వార్ ను బీఆరెస్, బీజేపీ నాయకులే ప్రారంభించారు. తమ ప్రభుత్వాలు సుస్థిరమైనవి, కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరమైందని చాటిచెప్పేందుకు ఈ విమర్శలు చేపట్టారు.ఈ మాటలు రికార్డుచేసి వినిపించినట్లుగా పదేపదే నాయకులు వల్లెవేస్తున్నారు.

కేసీఆర్ వర్సెస్ రేవంత్

టచ్ పాలిటిక్సు పై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొడుతుందని జోస్యం చెప్పారు. 104 మంది ఎమ్మెల్యేలున్న తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారన్నారు. ఇదిలాఉండగా బీఆరెస్,బీజేపీ నాయకులు తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెబుతుండగా కాంగ్రెస్ మాత్రం టచ్ లో ఉన్నారంటూనే రోజుకో ఎమ్మెల్యేను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. నేటికి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది. కేసీఆర్ స్పందన పై సీఎం రేవంత్ రెడ్డి మరింత ఘూటుగా స్పందించారు. మా ఎమ్మెల్యేలను ముట్టుకో చూద్దాం… రేవంత్ రెడ్డిని ముట్టుకుంటే హైటెన్షన్ వైర్ ను ముట్టున్నట్లే…నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి చూస్తామంటూ మహబూబ్ నగర్ మీటింగ్ లో వ్యాఖ్యానించారు.

బీఆరెస్ నాయకుల ప్రారంభం

కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజులకే బీఆరెస్ నాయకులు, ఎమ్మెల్యేలు పల్లారాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి (ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరారు) మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్నాళ్ళ ముచ్చటే…త్వరలో బీఆరెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ప్రకటించి సంచలనానికి తెరతీశారు. ఆ తర్వాత మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ నుంచి నాయకులంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతోందంటూ వ్యాఖ్యానించారు. తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ ప్రకటిస్తూ వచ్చారు.

కొనసాగిస్తున్న బీజేపీ నాయకులు

తామేమి తక్కువ కాదని బీజేపీ ఎంపీలక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ చెబుతూ వస్తున్నారు. గమ్మత్తేమిటంటే ఈ ప్రభుత్వాన్ని మేము మాత్రం కూల్చమంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఐదుగురు మంత్రులు తమతో టచ్ లో ఉన్నారంటూ చెప్పారు. తమ ఎమ్మెల్యేల జోలికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామంటూ ప్రకటించారు. తొలుత ఓటమి నుంచి బయటపడేందుకు మాట్లాడినా, తర్వాత కేడర్, నాయకులను నిలబెట్టుకునేందుకు మాట్లాడినట్లు భావించినా…తర్వాత ప్రభుత్వం పడిపోతుందనడం రివాజుగా మారింది. నెల రోజుల తర్వాత కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ప్రతిస్పందించారు. విపక్ష ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెబుతూ ఆచరణలో అమలు చేస్తూ ఝలక్ ఇస్తున్నారు.

గేట్లు తెరిచిన కాంగ్రెస్ పార్టీ

సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించి గేట్లు తెరిచామంటూ ప్రకటించి సికింద్రాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో చేరికలను ప్రారంభించారు. ఈ వరుసలో స్టేషన్ ఘన్ పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం, తెల్లం వెంకట్రావులు చేరిపోయారు. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ క్యూలో ఉన్నారు. ఈ చేరికల పరంపర ఎంత కాలం సాగుతుందోననే చర్చ సాగుతోంది. కొద్దిరోజుల క్రితం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆరెస్ నుంచి 25 ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ప్రకటించారు. , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరులు మాట్లాడుతూ బీఆరెస్ పతనం ప్రారంభమైందని, తాము తలుచుకుంటే ఆ పార్టీలో ముగ్గురు మాత్రమే మిగులుతారని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికి లేదని మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ ముఖ్యనాయకులెవరు మాట్లాడిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ ప్రకటిస్తూ వస్తున్నారు.

బీజేపీ పడగొడుతోంది

ఇదిలాఉండగా ఈ సర్కారు కూల్చివేతలు, ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారనే అంశం పై ఆలశ్యంగా స్పందించిన కేసీఆర్ తమతో కాంగ్రెస్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ చెప్పడం ఆసక్తికరంగా మారింది. తాము ప్రభుత్వాన్ని కూల్చివేయమంటూ ఈ నెపం బీజేపీ పై నెట్టేందుకు ప్రయత్నించడం గమనార్హం. పైగా 104 మంది ఎమ్మెల్యేలున్న బీఆరెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని చెప్పారు. కేవలం 64 మంది ఎమ్మెల్యేలతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం బీజేపీకి కష్టమేమి కాదంటూ ఆపార్టీని ఇరికించడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. కేసీఆర్ తాజా విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

జుగుప్సాకర రాజకీయం

ఇదిలాఉండగా పార్లమెంటు ఎన్నికలు ముగిసేవరకు ఈ పడిపోవడం, కూల్చడం, టచ్ లో అనే పదాలు సాగుతూనే ఉంటాయని భావిస్తున్నారు. ముందు జాగ్రత్త కోసమని చెబుతున్నప్పటికీ ఆ పార్టీ మాత్రం ఫిరాయింపులకు తెరలేపింది. ఆ పార్టీ చేస్తున్న పని అప్రజాస్వామికమైందే అయినప్పటికీ ఆ అవకాశం కల్పించడంలో బీఆరెస్, బీజేపీ రాష్ట్ర నాయకుల పాత్ర ప్రధానమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన పక్షాల నేతలంతా కలిసి ప్రజా తీర్పు అవహేళన చేస్తూ రాష్ట్రంలో మరోసారి రాజకీయ దిగజారుడు విధానాలను కొనసాగిస్తున్నారు.

తమ ఎమ్మెల్యేలు, శ్రేణులను కాపాడుకునేందుకు విపక్షాలు, అధికారాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీ రాష్ట్రంలో అనుసరిస్తున్న రాజకీయ విలువల పతనానికి తాజా ఉదాహరణ. ఎక్కువ తక్కువలో తేడా తప్ప ప్రధాన పార్టీలు ఒకే గూటి పక్షులుగా వ్యవహరించడం జుగుప్సాకరంగా మారిందని విమర్శిస్తున్నారు. ప్రజల కష్టసుఖాలు, సమస్యలను గాలికొదిలి, ఫక్తు అధికారం, కుర్చీ తప్ప ప్రజాతీర్పును గౌరవించాలనే ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఫిరాయింపులను ప్రోత్సహించడం, ప్రభుత్వాలను కూలగొట్టడం తమ గొప్పతనంగా చెప్పుకోవడం సిగ్గుచేటంటున్నారు.

Latest News