సోమాలియా తీరంలో కార్గోషిప్‌ హైజాక్‌

ఆఫ్రికా దేశమైన లిబేరియాకు చెందిన ఒక కార్గో షిప్‌ సోమాలియా తీరంలో హైజాక్‌నకు గురైంది. ఈ నౌకలో 15 మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తున్నది

  • Publish Date - January 5, 2024 / 09:32 AM IST

  • ఓడలో 15 మంది భారతీయులు
  • యుద్ధ నౌకను పంపిన నేవీ


ముంబై: ఆఫ్రికా దేశమైన లిబేరియాకు చెందిన ఒక కార్గో షిప్‌ సోమాలియా తీరంలో హైజాక్‌నకు గురైంది. ఈ నౌకలో 15 మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ విషయం తెలిసిన వెంటనే భారతీయ నావికాదళం అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు, బందీలను కాపాడేందుకు ఐఎన్‌ఎస్‌ చెన్నై యుద్ధ నౌకను పంపినట్టు మిలిటరీ అధికారులు తెలిపారు. భారతీయులు ఉన్న ఎంవీ లిలా నోర్‌ఫోక్‌ కార్గో నౌకను హైజాక్‌ చేశారన్న విషయం తమకు గురువారం సాయంత్రం తెలిసిందని పేర్కొన్నారు.


ఇండియన్‌ నేవీకి చెందిన యుద్ధ విమానం నౌకపై కన్నేసి ఉంచిందని, నౌకలోని భారతీయ సిబ్బందితో కమ్యూనికేషన్‌ ఏర్చుకున్నదని వెల్లడించారు. వారంతా నౌకలోని ఒక సురక్షిత ప్రాంతంలో ఉన్నారని తెలిపారు. గురువారం సాయంత్రం ఐదారుగురు సాయుధులు నౌకలోకి చొరబడ్డారని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ (యూకేఎంటీవో) పోర్టల్‌కు నౌక నుంచి సందేశం వచ్చింది. ఈ సందేశం అందగానే వెంటనే ఐఎన్‌ఎస్‌ చెన్నై యుద్ధ నౌకను పంపారు. శుక్రవారం ఉదయానికి యుద్ధ విమాన సిబ్బంది నౌకలోని వారితో కాంటాక్ట్‌ నెలకొల్పుకున్నది.

Latest News