Site icon vidhaatha

Chandrababu | చంద్రబాబుకు షాక్‌.. 14 రోజుల రిమాండ్.. ఖైదీ నంబర్ 7691

Chandrababu |

స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు జైలు శిక్ష

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టైన టీడీపీ అదినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. ఈ నెల 22 వరకు రిమాండ్‌ విధిస్తున్నట్లు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు రిమాండ్‌ రిపోర్టుకు సంబంధించి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాదనలు సుదీర్ఘంగా మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగాయి.

బాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏపీ పొన్నవోలు సుధాకరెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో న్యాయమూర్తి ఎలాంటి తీర్పు వెలువరిస్తారన్న ఉత్కంఠ నెలకొన్నది. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి చంద్రబాబుకు రిమాండ్‌ విధించారు.

బెయిల్‌ పిటిషన్‌ దాఖలు

ఈ కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్‌ విధించడంతో ఆయన తరఫున న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి.

రాజమహేంద్రవంర సెంట్రల్‌ జైలుకు బాబు!

ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ఆయనను రాజమహేంద్రవరం జైలుకు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా కారణాల రీత్యా ఆయనను వాయుమార్గంలో తరలించే అవకాశం ఉన్నది. విజయవాడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి హెలీకాప్టరక్షలో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు, అక్కడి నుంచి జైలుకు తరలించనున్నారు.

ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్‌

మరోవైపు బాబుకు కోర్టుకు రిమాండ్‌ విధించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో బాగంగా ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

బాబుకు తన మద్దతు కొనసాగుతుంది: పవన్‌ కల్యాన్‌

టీడీపీ అధినేత చంద్రబాబుకు తన మద్దతు కొనసాగుతుందని జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కల్యాన్‌ అన్నారు. బాబుకు రిమాండ్‌ నేపథ్యంలో మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చేసిన పనులకు ఎవరూ భయపడేవాళ్లు లేరని మండిపడ్డారు.

చట్టాలు సరిగా పనిచేస్తే.. బెయిల్‌పై వచ్చిన వాళ్లు ముఖ్యమంత్రులు కాలేరని వ్యాఖ్యానించారు. వారాహి యాత్ర సమయంలో వైసీపీ నేతలు కోనసీమ జిల్లాలో 2 వేల మంది నేరగాళ్లను దింపారు. కోనసీమ జిల్లాలో 50 మంది చంపేయాలని పథకం పన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి కుట్రలు పన్నారు. కేంద్రం నుంచి తీవ్ర హెచ్చరికలు రావడంతో వెనక్కి తగ్గారని పవన్‌ ఆరోపించారు.

చంద్రబాబు ఖైదీ నంబర్ 7691

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు ఆదివారం అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు అధికారులు చంద్రబాబుకు రిమాండ్ ఖైదీ నంబర్ 7691 కేటాయించారు.

విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల పాటు అంటే ఈ నెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దాంతో సిట్ అధికారులు చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కోసం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.

జైలు అధికారులు చంద్రబాబుకు స్నేహ అప్పర్ బ్లాక్ లో గది కేటాయించారు. ఈబ్లాక్ ఎదురుగానే ఉన్న జైలు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబుకు ఇంటి నుంచే భోజనం, మందులు సమకూర్చారు. సోమవారం చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణిల ములాఖత్‌కు అనుమతించినా, ఆ తర్వాత నిరాకరించారు.

Exit mobile version