Site icon vidhaatha

Chandrayan-3 | భూకక్ష్యను దాటి.. చందమామ దిశగా చంద్రయాన్‌-3.. 17న చంద్రుడిపై ల్యాండింగ్‌..!

Chandrayan-3 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు భూక్షక్ష్యలో తిరిగిన వ్యోమనౌక మంగళవారం భూకక్ష్యను వదిలి చంద్రుడి కక్ష్య దిశగా కదులుతోందని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. ట్రాకింగ్‌, కమాండ్‌ నెట్‌వర్క్‌ నుంచి విజయవంతంగా ఫైరింగ్‌ జరిగిందని, ఆ తర్వాత అంతరిక్ష నౌక చంద్రుడిపైకి తన ప్రయాణాన్ని ప్రారంభించిందని పేర్కొంది.

ఈ నెల 5న చంద్రయాన్‌-3 అంతరిక్ష నౌక చంద్రుని కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ.. పలుసార్లు కక్ష్యను తగ్గించుకుంటూ వెళ్లనున్నారు. ఈ నెల 16 వరకు ఈ కక్ష్య కుదింపు కొనసాగుతుంది. చివరకు ఆగస్టు 17న చంద్రుడి ఉపరితలానికి 100 కిలోమీటర్ల దూరంలో ప్రొపల్సన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ విడిపోతుంది. చంద్రయాన్-3 ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ కానుంది. చంద్రుడి గుట్టును తెలుసుకునే లక్ష్యంతో చంద్రుడిపైకి జులై 14న చంద్రయాన్‌-3 రాకెట్‌ను పంపిన విషయం తెలిసిందే.

రహస్యాలను చేధించే లక్ష్యంతో చంద్రయాన్‌-3 రాకెట్‌ను ఇస్రో జూలై 14న ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇస్రో చంద్రయాన్‌-3ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. ల్యాండర్, రోవర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగి 14 రోజుల పాటు ప్రయోగాలు నిర్వహించనున్నాయి. ఈ మిషన్ ద్వారా ఇస్రో చంద్రుడి ఉపరితలంపై భూకంపాలు ఎలా సంభవిస్తాయో తెలుసుకోవడంతో పాటు చంద్రుడి నేలపై సైతం అధ్యయనం చేయనున్నది. ల్యాండర్‌, రోవర్‌ చంద్రుడిపై విజయవంతంగా దిగితే.. అమెరికా, చైనా, రష్యాల సరసన భారత్‌ నిలువనున్నది.

Exit mobile version