Warangal | నిన్న ఒక్కటే.. ఇప్పుడు పక్కలో బల్లెం

నిన్నంతా ఒక్కటే....అలాయ్ భలాయ్ లూ...ఆలింగనాలు చేసుకున్న మిత్రులు వారు ముగ్గురూ...ఒకే పార్టీ బీఆర్ఎస్ లో కలిసిమెలిసి పనిచేశారు. పార్టీలో దళితులకు తగిన స్థానం కావాలంటూ మాట్లాడినవారే

  • Publish Date - April 13, 2024 / 03:00 PM IST

ముగ్గురూ ముగ్గురే.. బీఆర్ఎస్ పార్టీ
బరిలో వరంగల్ ఎంపీ అభ్యర్ధులు
కడియం కావ్య, మారపల్లి సుధీర్, అరూరి
పదవుల కోసం పార్టీ మారిన నేతలు
ఒకరిపై ఒకరు పరుషమైన దూషణలు
అభివృద్ధి, ప్రజాసమస్యల చర్చ గాలికి

 

విధాత ప్రత్యేక ప్రతినిధి: నిన్నంతా ఒక్కటే….అలాయ్ భలాయ్ లూ…ఆలింగనాలు చేసుకున్న మిత్రులు వారు ముగ్గురూ…ఒకే పార్టీ బీఆర్ఎస్ లో కలిసిమెలిసి పనిచేశారు. పార్టీలో దళితులకు తగిన స్థానం కావాలంటూ మాట్లాడినవారే. తమ తమ అధికారం కోసం పార్టీలో తీవ్రంగా ప్రయత్నించిన వారే. కొద్ది రోజుల్లోనే స్థానభ్రంశం జరిగింది. వీరు వారయ్యారు…వేర్వేరు పార్టీల్లో చేరిపోయారు. ఇప్పుడు ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి నెలకొంది.

పక్కలో బల్లెంలా మారిపోయి పరుషమైన పదజాలంతో విమర్శించుకుంటున్నారు. ముగ్గురూ మూడు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. వారే వరంగల్ లోక్ సభ అభ్యర్ధులుగా బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్ధులు కడియం కావ్య, మారపల్లి సుధీర్ కుమార్, అరూరి రమేష్ లు. అధికారం కోసం ఎంతటి విమర్శలైనా చేసుకునే తాజా రాజకీయ పరిస్థితుల్లో దళిత సామాజిక వర్గమైనంత మాత్రానా, ఎంపీ అభ్యర్ధులైనందున వేరుగా ఉంటారా? వడ్లగింజలదే బియ్యం గింజ అంటూ చమత్కరిస్తున్నారు. పరస్పరం తీవ్ర విమర్శలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు.

అభ్యర్ధులు ముగ్గురూ ముగ్గురే

వరంగల్ ఎంపీ అభ్యర్ధులుగా పోటీలో ఉన్న అభ్యర్ధులు ముగ్గురు ముగ్గురే. మారపల్లి సుధీర్ కుమార్, అరూరి రమేష్, కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీలు కలిసున్నవారే. కావ్య పార్టీలో ప్రత్యక్షంగా భాగస్వామ్యంకానప్పటికీ శ్రీహరి బిడ్డగా దశాబ్దకాలంగా ఒకరికొకరు సుపరిచితులే. సుధీర్ కుమార్ తొలి నుంచి బీఆర్ఎస్ లో పనిచేస్తుండగా అరూరి రమేష్ 2004 ఎన్నికల తర్వాత కొంతకాలానికి పీఆర్పీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. మొన్నటి వరకూబీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు.

శ్రీహరి కుమార్తెగా కావ్యకు ఛాన్సు

సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ తో పాటు సీనియర్ నాయకులు అరూరి రమేష్ తదితరులనుకాదని కడియం కావ్యను ముందుగా బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా ఎంపిక చేస్తే, ఆ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని కాలదన్ని కాంగ్రెస్ పార్టీలో చేరి తిరిగి ఎంపీ అభ్యర్ధిగా ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డాక్టర్ కావ్య తన కంటే తన తండ్రి కడియం శ్రీహరి కుమార్తెగా జనానికి పరిచయం. కడియం ఫౌండేషన్ పేరుతో చేపట్టిన కార్యక్రమాల ద్వారా ఆమె పేరు కొంత పరిచయం.

ఎన్నడూ ప్రత్యక్షంగా రాజకీయ కార్యకలాపాలు చేపట్టలేదు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా కావ్యను ప్రకటించినప్పుడు ఆమెకు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడాలేదు. కేవలం కడియం శ్రీహరి కుమార్తెగానే ఈ అవకాశం లభించిందనండంలో సందేహంలేదు. తాజా రాజకీయ పరిస్థితులను లోతుగా పరిశీలిస్తే కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకు కావ్యకు బీఆర్ఎస్ ఎంపి అభ్యర్ధిగా ఎంపిక చేసిందనడం సమంజసంగా ఉంటోంది.

కడియానికి కలిసొచ్చిన పరిస్థితి

ఐదేళ్ళుగా తన బిడ్డ కావ్యను రాజకీయవారసురాలిగా రంగ ప్రవేశం చేయించేందుకు కడియం శ్రీహరి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముందుగా స్టేషన్ ఘన్ పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీలో నిలపాలని భావించినప్పటికీ స్థానిక రాజకీయ పరిస్థితుల కారణంగా సాధ్యంకాలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా శ్రీహరి గెలుపొందారు. అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

కానీ, ఇటీవల బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామంటూ, కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాలతో కూలిపోతోందని, తాము అధికారంలోకి వస్తామంటూ ఓటమిపాలైన పార్టీలు అనైతిక ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఎన్నికల్లో ఫిరాయింపుల గురించి ఎన్నో నీతులు చెప్పిన కాంగ్రెస్ పార్టీ, సమయం రాగానే ప్లేట్ ఫిరాయించి ఫిరాయింపులకు తెరతీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈ క్రమంలో ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా ఎంపికైన కావ్య ఆ పార్టీని తిరస్కరించి కాంగ్రెస్ తీర్ధంపుచ్చుకున్నారు. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ తన బిడ్డ విజయానికి సరైన పార్టీగా కడియం భావించారు. ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. వరంగల్ ఎంపీ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కడియం మినహా అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. దీంతో తాను కూడా కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ బలం ఏకపక్షంగా మారి తన బిడ్డ గెలుపు సులువవుతుందని భావించి పార్టీ మారారు.

ఉద్యమకారుడు మారపెల్లి

మారపెల్లి సుధీర్ కుమార్ బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో ముందున్నారు. ఆయనను గుర్తించి హనుమకొండ జడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పించారు. ముందు నుంచి పార్టీకి, కేసీఆర్ కు విధేయుడిగా ఉన్నారు. పార్టీని ఇబ్బందులు పెట్టిన సందర్భంలేదు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. విద్యావంతుడు. జడ్పీ చైర్మన్ గా సుపరిచితుడైనందున ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో కేసీఆర్ మారపల్లి వైపు మొగ్గుచూపారు. మారపల్లికి టికెట్ ఇవ్వడం వల్ల ఉద్యమకారులను గౌరవించినట్లవుతోందని భావించారు. పార్టీకి విధేయుడిగా ఉన్నారు.

తాజా పరిస్థితుల్లో పార్టీలో టికెట్ ఆశించిన వారితో పోల్చితే మారపల్లి బెటర్ కావడమే కాకుండా ఇతరుల విమర్శలకు తావు లేదంటున్నారు. ప్రత్యర్ధులుగా కాంగ్రెస్ నుంచి కావ్య, బీజేపీ నుంచి అరూరి రమేష్ తమ పార్టీ నుంచి వెళ్ళడంతో కేడర్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ సెంటిమెంట్ పనిచేయాలంటే ఉద్యమకారుడనే బ్రాండ్ ఉపయోగపడుతోందని భావిస్తున్నారు. పైగా రాజయ్య పార్టీకి రాజీనామా చేసినందున ఆయనకు టికెట్ ఇస్తే పార్టీని కాదన్న వ్యక్తిని పిలిచి అవకాశం ఇచ్చారనే చర్చ జరుగుతోందని, సుధీర్ ఉండగా ఇతరుల వైపు మొగ్గుచూపడమెందుకనే భావనతో ఈ నిర్ణయం చేసినట్లు సమాచారం.

అరూరి ముందు జాగ్రత్త?

అరూరి రమేష్ ముందు జాగ్రత్తగా బీజేపిలో చేరారని చర్చించుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా మూడవసారి పోటీచేసి ఓటమిపాలయ్యారు. రమేష్ బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా కూడా ఉన్నారు. బీఆర్ఎస్ లో కేటీఆర్, హరీష్ లతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఓటమి తర్వాత రమేష్ పార్టీ మారుతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. వీటిని రమేష్ కొట్టిపారేశారు. కానీ, కొద్ది రోజులకే ఆయన బీజేపీలో చేరుతున్నారనే సమాచారం రావడంతో చివరి నిమిషంలో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన పార్టీ వీడకుండా కట్టడిచేసే ప్రయత్నం చేపట్టారు.

అధినేత కేసీఆర్ స్వయంగా అరూరితో మంతనాలు జరిపారు. వారి వద్ద తలూపి తర్వాత బీజేపీలో చేరిపోయారు. బీజేపీ ఆయనకు ఎంపీ అభ్యర్ధిగా ఆఫర్ ఇచ్చింది. అరూరి బీజేపీలో చేరడం వల్ల గతంలో ఆయన పై వచ్చిన భూ కబ్జాలు, అవినీతి ఆరోపణల నుంచి రక్షణ లభిస్తుందనే అభిప్రాయం ఉంది. వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భారీగా భూ కబ్జాలకు పాల్పడ్డారనే విమర్శలు స్వంత పార్టీ నేతలే కాకుండా విపక్షాల నుంచి వెల్లువెత్తాయి. ఎన్నికల్లో ఆయన ఓటమికి ఇదొక కారణమనే చర్చ ఉంది. బీజేపీకి కూడా సరైన అభ్యర్ధి లేక పోవడం, ఆర్ధిక బలం, మాదిగ సామాజిక వర్గం, మాజీ ఎమ్మెల్యే కావడంతో బీజేపి గాలం వేసినట్లు చెబుతున్నారు.

పరస్పర పరుషమైన విమర్శలు

నిన్నటి వరకు ముగ్గురు బీఆర్ఎస్ లో కలిసి ఉండి ప్రస్తుతం పార్టీలు మారడంతో ఒకరిపై ఒకరు పరుషమైన విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కొద్ది రోజల ముందు కడియం శ్రీహరి బీఆర్ఎస్ చేరారు. పార్టీలో చేరిన కొద్ది కాలానికే వరంగల్ ఎంపీగా, డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్సీగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా అవకాశం పొందారు. ఎంతో మంది దళితనాయకుల అవకాశాలను కడియం లాక్కున్నారని మారపల్లి మీడియా సమావేశంలో విమర్శలు చేశారు. ఉద్యమంలో కష్టాలు, నష్టాలు తాము అనుభవిస్తే పదవులు కడియం అనుభవించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డకు ఎంపీ అవకాశం కల్పించినా, పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు. కావ్య పార్టీకి ఏం చేసిందని ప్రశ్నించారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యేగా అరూరి రమేష్ కు మూడు పర్యాయాలు పార్టీ అవకాశం కల్పించిందని మారపెల్లి అన్నారు. అధికారంలో ఉన్నంత కాలం పార్టీలో ఉండి ఇప్పుడు అవకాశవాదంతో బీజేపిలో చేరారని విమర్శించారు. అనేక ఆరోపణలొచ్చినా పార్టీ అండగా నిలిచినా పార్టీకి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఇదిలాఉండగా అరూరి రమేష్ మాత్రం కడియం పైన విరుచుకపడుతున్నారు. కడియం స్వార్ధపరుడని, మాదిగలను అణచివేశారని, మొన్నటి ఎన్నికల్లో తన ఓటమికి పనిచేశారని విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి మాదిగలు వెళ్ళిపోయేందుకు కడియం కారణమంటూ ఆరోపించారు. రాజయ్య, పసునూరి, తాను కడియం వల్ల పార్టీ వీడినట్లు విమర్శించారు. కడియం కావ్య స్థానికురాలు కాదంటూ మహ్మద్ కావ్య, గుంటూరు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటిపై కడియం శ్రీహరి, కావ్య తీవ్రంగా ప్రతిస్పందించారు. మారపల్లి పై ఏ విమర్శలు చేయకున్నా అరూరి రమేష్ పై విరుచుకపడ్డారు. నీ భూకబ్జాలు…మండలానికో గెస్ట్ హౌజ్ ల వ్యవహారం తెలిసి ప్రజలు ఓడించారని ఫైరయ్యారు. నిన్ను కాంట్రాక్టర్ చేసిందేనేనంటూ చెప్పారు.

గాలికొదిలిన ప్రజాసమస్యలు

పరస్పర విమర్శలతో ప్రచారానికి ముందే రాజకీయం వేడెక్కింది. రాబోయే రోజుల్లో ముగ్గురు మధ్య మాటల తూటాలు పేలనున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ అభ్యర్ధి కావ్య, కడియం ల-క్ష్యంగా బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. వీటిని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు గాలికొదిలేసి పరస్పర రాజకీయ విమర్శలు, వ్యక్తిగత మైన దూషణలతో ప్రచారాన్ని ప్రారంభించారు. చేసిన అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, పార్టీ ఫిరాయింపుల పై విమర్శలు చేసుకుంటూ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారు.

కులం, మతాంతర వివాహాన్ని సైతం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ముగ్గురూ దళితులుగా ఉంటూ పరస్పరం తీవ్రంగా విమర్శించుకోవడం జుగుప్సాకరంగా మారిందంటున్నారు. ఈ మధ్యలో ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ కాంగ్రెస్, బీఆర్ఎస్ ను విమర్శిస్తూ బీజేపీకి మద్ధతునందించాలంటున్నారు. కడియం లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. కడియం మాదిగల ద్రోహి అంటే దీనికి కడియం అంతే ఘాటుగా ప్రతిస్పందిస్తూ కృష్ణ మాదిగను నమ్మేవారులేరన్నారు.

Latest News