విధాత: నాగుపాము పేరు వినగానే శరీరంలో వణుకు పుడుతోంది. ఇక అది మనకు కనిపించిందంటే చాలు హడలిపోతాం. అక్కడ్నుంచి పరుగులు పెడుతాం. కానీ ఓ విద్యార్థిని స్కూల్ బాగులోకి నాగుపాము దూరింది. ఆ విషయం ఆమెకు కూడా తెలియదు. అలానే ఆ బ్యాగును స్కూల్‌కు మోసుకెళ్లింది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ షాజపూర్‌లోని బదోని స్కూల్‌కు చెందిన ఓ విద్యార్థిని స్కూల్‌కు వెళ్లింది. సార్ నా బ్యాగులో ఏదో కదులుతుందని ఉపాధ్యాయుడికి చెప్పింది. దీంతో ఆ టీచర్ బ్యాగును నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, దులుపగా నలుపు రంగులో ఉన్న నాగుపాము బయటపడింది.
దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. బాలికకు ఎలాంటి హానీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక నాగుపాము అక్కడున్న బండల్లోకి జారుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.