Harley Vs Triumph
విధాత: ద్విచక్రవాహన రంగంలో సరికొత్త పోటీకి తెరలేచింది. హై సీసీ బైక్‌ల శ్రేణిలో గుత్తాధిపత్యం చలాయిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను ఢీ కొట్టడానికి బజాజ్, హ్యార్లీ డేవిడ్ సన్ సిద్ధమయ్యాయి. 350 – 500 సీసీ శ్రేణిలో ఈ రెండు సంస్థలూ తమ మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నాయి. హీరో మోటార్ కార్ప్ హ్యార్ల డేవిడ్ సన్ సంయుక్తంగా రూపొందించిన బైక్ ఎక్స్ 440. దీని అద్భుతమైన బాడీ డిజైన్‌తో ఇప్పటికే అందరి దృష్టినీ ఆకర్షించింది.
భారతీయుల ఆలోచనలను అర్థం చేసుకుని, డిజైన్ చేయడానికే భారతీయ సంస్థ హీరోతో జత కట్టినట్టు హ్యార్లీ సంస్థ వెల్లడించింది. హ్యార్లీ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చే సమాచారాన్ని సమన్వయం చేసుకుంటూ ఎక్స్ 440ను పూర్తిగా భారత్‌లోనే మాన్యుఫ్యాక్చర్ చేయడం విశేషం. బజాజ్ తీసుకొస్తున్న ట్రయంఫ్ స్పీడ్ 400 కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్‌లో పాగా వేయడానికేనని అర్థమవుతోంది. గత కొన్నేళ్లుగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీ నిస్తూ 350 – 500 శ్రేణిలో బజాజ్ వరుస మోడళ్లను తీసుకొస్తొంది.
ఇంజిన్ సామర్థ్యం
హ్యార్లీ ఎక్స్ 440లో సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను ఏర్పాటు చేశారు. పేరులోనే ఉన్నట్లు దీనికి 440 సీసీ సామర్థ్యం ఉంది. ఈ పవర్‌ఫుల్ ఇంజిన్ వల్ల రోడ్డుపై రైడ్ చేసినపుడు మంచి థ్రిల్ వస్తుందని కంపెనీ చెబుతోంది. 4000 ఆర్పీఎం వద్ద కూడా టార్క్‌ను ఇస్తుండటంతో వీధులు, హైవేలు అని లేకుండా ఎక్కడైనా దూసుకుపోవచ్చని అర్థమవుతోంది. మరోవైపు ట్రియంఫ్ స్పీడ్ 400.. లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తోంది.
అయితే ఇందులో సీసీ 400కు కాస్త తక్కువగా 398.15గా ఉంటుంది. ఇది 6500 దగ్గర 37.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైవేల మీద దీనిపై రైడ్ బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. రెండు వాహనాలూ కూడా వివిధ రోడ్లకు సరిపోయేలా ఆరు గేర్లతో వస్తున్నాయి. గేర్ కంట్రోల్, సామర్థ్యం మొదలైన వాటిలో ట్రయంఫ్ స్పీడ్ 400దే కాస్త మెరుగని తెలుస్తోంది.
నోస్టాల్జియా టచ్
హ్యార్లీ డేవిడ్ సన్ అనగానే పాత హాలీవుడ్ సినిమాల్లో బైక్, దాన్ని నడిపేటపుడు వచ్చే సౌండే గుర్తుంటుంది. దాన్ని రైడర్లకు ఇవ్వడం కోసమే ఇంజిన్ కూలింగ్ సిస్టంను ఎయిర్ అండ్ ఆయిల్ కూలింగ్ సిస్టంగా డిజైన్ చేశారు. అదే ట్రయంఫ్ మాత్రం ఇంజినీరింగ్ అడ్వాన్స్‌మెంట్‌ను నమ్ముకుని లిక్విడ్ కూలింగ్‌తో ఇంజిన్‌ను తయారుచేసింది. ఈ ఏర్పాటు వల్ల ఇంజిన్ కాస్త దీర్ఘకాలం మన్నే అవకాశముంటుంది.
ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కనెక్టివిటీలో మాత్రం హ్యర్లీ ఆధునికతను అందిపుచ్చుకుంది. డిజిటల్ తెరను ఇవ్వడంతో పాటు బ్లూటూత్, వైఫై కనెక్టివిటీని సైతం ఇచ్చింది. దీని వల్ల మొత్తం సమాచారం రైడర్ చేతుల దగ్గరే ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌తో కాల్స్ మాట్లాడటం, మెసేజ్‌లు చూసుకోవడంతో పాటు నావిగేషన్‌ను సైతం సులువుగా యాక్సెస్ చేయొచ్చు. ట్రయంఫ్ 400 మాత్రం అనలాగ్ ప్యానల్‌కు ఓటేసింది. అయితే అది పూర్తిగా ఏఏ ఫీచర్లను ఇవ్వనుందనే అంశం ఇంకా బయటకు రాలేదు.
భద్రతలో ఏది మెప్పించింది
అయితే రైడర్‌కు ఈ రెండింటిలో ఏ బైక్ ఎక్కువ థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందంటే హ్యార్లీ ఎక్స్ 440 నే అని చెప్పక తప్పదు. ట్రయంఫ్ కంటే కొన్ని అత్యాధునిక ఫీచర్లతో రూపొందించడమే దీనికి కారణం. అందులో ప్రధానమైంది స్విచబుల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం (ఏబీఎస్). దీని వల్ల రోడ్డు పరిస్థితిని బట్టి ఎక్స్ 440 బైకర్ తన బ్రేకింగ్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు.
అంతే కాకుండా ముందే చెప్పుకున్నట్లు డిజిటల్ స్క్రీన్ ఇవ్వడం, దానికి కనెక్టివిటీ పెంచడం మరో ప్రధాన ఆకర్షణ. ఎక్స్ 440 ఆర్టిఫిషియల్ ఎక్స్‌హా స్ట్ సౌండ్ సిస్టంతో వస్తుండటంతో బండి శబ్ధం చాలా వినసొంపుగా ఉండనుందని తెలుస్తోంది. ఇందులో ఉండే సర్వీస్ డ్యూ ఇండికేటర్ సాయంతో బైక్ సర్వీసింగ్ను ఎప్పుడు చేయించుకోవాలో కూడా రైడర్‌కు ఒక అవగాహన ఉంటుంది. ఈ ఫీచర్లతో భద్రత పరంగా హ్యీర్లీ ఒక అడుగు ముందే ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.