- చెక్కబ్రిడ్జిపై కారులో చిక్కుకున్న థాయ్ మహిళ
- తృటితో ప్రాణాలతో బయటపడ్డ బాధితురాలు
GPS | విధాత: మనకు తెలియని ప్రదేశానికి వెళ్లడానికి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్‌ను వాడుతుంటాం. అది చెప్పే సూచనల ఆధారంగా రోడ్లపై వెళ్తుంటాం. కొందరు కేవలం జీపీఎస్‌ను నమ్ముకొనే ప్రయాణాలు సాగిస్తుంటారు. కొన్నిసార్లు జీపీఎస్ తప్పిదాలకు అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వెలుగుచూశాయి.
తాజాగా జీపీఎస్ ఆధారంగా కారులో ప్రయాణించిన ఓ మహిళ ప్రమాదంలో పడింది. జీపీఎస్ చెప్పిన మార్గంలో వెళ్లి పాదచారుల చెక్క వంతెనపై తన కారుసహా ఇరుక్కుపోయింది. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా నదిలో పడి చనిపోయేది. రెస్క్యూ టీమ్‌లు సకాలంలో స్పందించి ఆమెను రక్షించాయి. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది.
అసలు ఏం జరిగిందంటే.. థాయ్‌లాండ్‌లోని నాంగ్ మువాంగ్ ఖాయ్ జిల్లాకు చెందిన మహిళ సంగ్ మెన్‌లోని స్నేహితుడిని చూడటానికి కారులో బయలుదేరింది. తన స్నేహితుడు పంపిన లొకేషన్‌కు చేరడానికి ఆమె జీపీఎస్పై ఆధారపడింది. జీపీఎస్ చెప్పినట్టు “వియాంగ్ థాంగ్ బ్రిడ్జ్”ని దాటడానికి ప్రయత్నించింది. అది పాదచారులకు మాత్రమే ఉద్దేశించిన చెక్క సస్పెన్షన్ బ్రిడ్జి కావడంతో మధ్యలోకి వచ్చి కారు చిక్కుకుపోయింది.
120 మీటర్ల పొడవైన వంతెన బయటకు కారు మందు చక్రం వెళ్లి ఇరుక్కుపోయింది. తీవ్ర భయాందోళనకు గురైన మహిళా డ్రైవర్ అరవడంతో స్థానికులు గమనించి అధికారులకు ఫిర్యాదుచేశారు. సహాయ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని బాధితురాలిని రక్షించాయి. బతుకు జీవుడా అంటూ తృటిలో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
“నేను జీపీఎస్‌పై దృష్టి పెట్టా. చుట్టూ చూడలేదు. వంతెన దృఢంగా ఉందని, ఇతరులు ఉపయోగించే అవకాశం ఉందని నేను అనుకున్నా. కానీ, నా కారు ఇరుక్కుపోయినప్పుడు నేను యోమ్ నది మధ్యలో ఉన్న. నేను చాలా భయపడ్డా. నేను, కారు నదిలో పడిపోవచ్చని భయపడ్డా. నేను సహాయం కోసం అరిచాను. నన్ను రక్షించారు” అని ఆ మహిళ చెప్పింది.