Site icon vidhaatha

సూకీని విడుదల చేయాలి.. ఐరాస భద్రతా మండలిలో తీర్మానం

Myanmar crisis | మయన్మార్‌లో కొనసాగుతున్న మానవహక్కుల సంక్షోభానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బుధవారం తొలి తీర్మానం ప్రవేశపెట్టారు. మయన్మార్ సైన్యం (జుంటా) ఏకపక్షంగా నిర్బంధించిన పౌరులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. మయన్మార్ ప్రముఖ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ, మాజీ అధ్యక్షుడు విన్ మైంట్‌లను విడుదల చేయాలని తీర్మానంలో డిమాండ్‌ చేశారు. యూఎన్‌ఎస్‌సీ అధ్యక్ష స్థానంలో భారత్‌ ఉండడం విశేషం. మయన్మార్‌కు సంబంధించి బ్రిటన్ ఈ ప్రతిపాదనను తీసుకువచ్చింది. యూఎన్‌ఎస్‌సీలోని 12 మంది సభ్యులు మయన్మార్‌ను వెంటనే హింసను ఆపాలని, నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఓటింగ్‌ జరగ్గా.. రష్యా, చైనా, భారత్‌ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్ మాట్లాడుతూ గ్రీన్‌ఫీల్డ్, మయన్మార్‌లో రక్తపాతాన్ని ఆపడానికి ఈ తీర్మానం ఓ చర్య అని, ఇందుకు చాలా చేయాల్సి ఉందన్నారు. మరో వైపు మయన్మార్ సమస్యకు తక్షణ పరిష్కారం లేదని చైనా రాయబారి జాంగ్ జున్ అన్నారు. ఇదిలా ఉండగా.. గతేడాది ఫిబ్రవరి 1న ఎన్నికైన ప్రతినిధులపై తిరుగుబాటు చేసి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రస్తుతం మిలటరీ పాలకుడు జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ మయన్మార్ దేశాధినేతగా ఉన్నారు. తిరుగుబాటు తర్వాత అమెరికా, పాశ్చాత్య దేశాలు మయన్మార్‌పై పలు ఆంక్షలు విధించాయి. ఇంతకు ముందు 1990లలో ఎన్నికైన ప్రతినిధులను జైలులో పెట్టి.. మిలటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలోనూ అమెరికా 20 సంవత్సరాల పాటు మయన్మార్‌లో రాయబారిని నియమించలేదు. 2010లో మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరించిన తర్వాత అమెరికా తన రాయబారికి ఆ దేశానికి పంపింది.

Exit mobile version