- పుతిన్ సర్కారుపై విమర్శలే కారణం
- ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ఆంక్షలు
- తీవ్రంగా ఖండించిన హక్కుల సంఘాలు
మాస్కో : చెస్ దిగ్గజం గ్యారి కాస్పరోవ్‌ను రష్యా ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు దేశాధ్యక్షుడు వ్లదీమిర్ పుతిన్ సర్కార్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలోనూ, ప్రస్తుత ఉక్రెయిన్ యుధ్ధ భీభత్సకాండలపైనా పుతిన్ సర్కారుపై కాస్పరోవ్ బహిరంగంగా తీవ్ర విమర్శలు చేశారు. ఈ కారణంగా ఆయనను ఉగ్రవాదులు, తీవ్రవాదుల జాబితాలో చేర్చినట్టు రష్యా మీడియా తెలిపింది. 60 ఏళ్ల గ్యారీ కాస్పరోవ్ చదరంగంలో పలుమార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచారు. చాలా ఏళ్లుగా ఆయన పుతిన్ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని నిలదీస్తున్నారు.
ప్రభుత్వం అనుసరిస్తున్నరాజకీయ, ఆర్థిక, ప్రజా వ్యతిరేక విధానాలపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను కాస్పరోవ్ తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే తాజాగా రష్యా ఆర్థిక పర్యవేక్షణా సంస్థ (రోస్ ఫిన్ మానిటరింగ్) విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలో కాస్పరోవ్ పేరు చోటుచేసుకున్నది. ఏ కారణంతో కాస్పరోవ్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిందనే విషయాన్ని తెలుపలేదు. ఆ జాబితాలో పేరు ఉన్న వ్యక్తుల ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ఆంక్షలు ఉంటాయి.
ఇదిలా ఉంటే.. గ్యారీ కాస్పరోవ్ రష్యా ప్రభుత్వ అణిచివేత విధానాలకు భయపడి 2014లోనే ఆదేశం నుంచి వెళ్లిపోయారు. ఆయన పదేళ్లుగా అమెరికాలో జీవిస్తున్నారు. 2022లో రష్యా న్యాయశాఖ కాస్పరోవ్‌పై విదేశీ ఏజెంట్ అని ముద్రవేసింది. కాగా కాస్పరోవ్‌పై పుతిన్ సర్కారు తీసుకున్న చర్యలను హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రత్యర్థుల అణిచివేతకు ఈ ఆంక్షలను రష్యా ప్రభుత్వం ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.