Site icon vidhaatha

షాకింగ్.. ఫోన్ కొంటాను.. నా రక్తం కొనుక్కోండి.. ఓ బాలిక వేడుకోలు

Smart Phone | ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్కూల్ పిల్లల నుంచి మొదలుకొంటే ముసలి వాళ్ల వరకు స్మార్ట్ ఫోన్ ను మెయింటెన్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ లేకపోతే ఏదో చిన్నతనంగా భావిస్తున్నారు. అలా భావించిన ఓ బాలిక స్మార్ట్ ఫోన్ ను కొనుక్కునేందుకు తన రక్తాన్ని అమ్మకానికి పెట్టింది. ఈ షాకింగ్ ఘటన పశ్చిమ బెంగాల్ లోని బాలుర్ ఘాట్ జిల్లా ఆస్పత్రిలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. తపాన్ కు చెందిన ఓ బాలిక 12వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి ఇంట్లోనే ఉంటుంది. తన ఇంట్లో ఎవరికి కూడా స్మార్ట్ ఫోన్ లేదు. దీంతో ఆ బాలిక స్మార్ట్ ఫోన్ కొనాలని నిర్ణయించుకుంది. ఫ్రెండ్ సహాయంతో ఆన్ లైన్ లో రూ. 9 వేల విలువ చేసే ఫోన్ ను ఆర్డర్ చేసింది. కానీ తన దగ్గర అన్ని డబ్బులు లేవు. తన రక్తాన్ని అమ్మి, ఆ డబ్బులతో ఫోన్ కొనాలని నిర్ణయించింది.

దీంతో తన గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలుర్ ఘాట్ జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. తన తమ్ముడు అనారోగ్యానికి గురయ్యాడు. డబ్బులు అవసరం ఉన్నాయి. తన రక్తాన్ని తీసుకొని డబ్బులివ్వండి అని ఆస్పత్రి సిబ్బందిని ఆ బాలిక ప్రాధేయపడింది. అనుమానం రావడంతో వారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించారు. అధికారులు వచ్చి విచారించగా.. ఆ అమ్మాయి అసలు విషయం చెప్పింది. స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేశాను. ఆ ఫోన్ ను కొనేందుకు రక్తాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది, అధికారులు షాక్ కు గురయ్యారు. బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించి, తల్లిదండ్రులకు అప్పగించారు.

Exit mobile version