గూగుల్‌ పే వాడుతున్నారా..? మీ కోసమే టెక్‌ దిగ్గజం ఈ అలెర్ట్‌..!

భారత్‌లో డిజిటల్‌ పేమెంట్స్‌ కోసం అత్యధికంగా వినియోగించే జాబితాలో గూగుల్‌ పే ఉన్నది. టెక్‌ దిగ్గజం గూగుల్‌కు చెందిన కంపెనీ యూపీఐ సర్వీసులను సైతం అందిస్తున్నది

  • Publish Date - November 24, 2023 / 04:10 AM IST

విధాత‌: భారత్‌లో డిజిటల్‌ పేమెంట్స్‌ కోసం అత్యధికంగా వినియోగించే జాబితాలో గూగుల్‌ పే ఉన్నది. టెక్‌ దిగ్గజం గూగుల్‌కు చెందిన కంపెనీ యూపీఐ సర్వీసులను సైతం అందిస్తున్నది. అయితే, కంపెనీ వినియోగదారులకు కీలక సూచనలు చేసింది. గూగుల్ పే ద్వారా లావాదేవీలు చేసే సమయంలో ఫోన్‌లో స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ వినియోగించొద్దని చెప్పింది. ఒక వేళ వాడినా వాటిని ఓపెన్‌ చేసి ఉంచొద్దని చెప్పింది. ఆయా యాప్‌ల ద్వారా సైబర్‌ నేరగాళ్లు మొబైల్‌లోని గూగుల్‌ పేయాప్‌ నుంచి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివరాలను సేకరించి మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించింది.


ఈ మేరకు యూజర్లను అప్రమత్తం చేసింది. యూజర్లకు మెరుగైన సేవలు అందించడంతో పాటు మోసాల బారినపడకుండా అడ్డుకునేందుకు కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికను వినియోగిస్తున్నట్లు టెక్‌ దిగ్గజం పేర్కొంది. గూగుల్‌ యాప్ ద్వారా జరిగే లావాదేవీల్లో సైబర్ నేరాల కట్టడికి తమవంతు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు యూజర్లు సైతం తమవంతు బాధ్యతగా సూచనలు పాటించాలని కోరింది. యాప్ ద్వారా చెల్లింపులు చేసే సమయంలో మొబైల్‌లో స్క్రీన్‌ షేరింగ్‌ యాప్‌లను ఉపయోగించొద్దని కోరింది. గూగుల్‌ ఎప్పుడూ థర్డ్‌ పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయమని కోరదని స్పష్టం చేసింది.


ఎవరైనా గూగుల్‌ పే ప్రతినిధిగా పేర్కొంటూ థర్డ్‌ పార్టీ యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేయమని సూచించినా నమ్మొద్దని హెచ్చరించింది. వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కోరింది. సైబర్‌ నేరగాళ్లు యాప్‌లను వినియోగించి మీ తరఫున లావాదేవీలను జరిపేందుకు డివైజ్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే డెబిట్ కార్డు వివరాలను తెలుసుకునే అవకాశాలుంటాయి. మొబైల్‌కు వచ్చిన ఓటీపీ సహాయంతో మీ అకౌంట్‌ నుంచి మరో ఖాతాకు డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే ప్రమాదం సైతం ఉంటుంది

Latest News