World Cup: మరి కొద్ది రోజులలో వన్డే వరల్డ్ కప్ సమరం మొదలు కానుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత స్వదేశంలో ఈ టోర్నీ జరగనుండగా, భారతీయ క్రికెట్ అభిమానులు దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2011 హిస్టరీని టీమిండియా మరోసారి రిపీట్ చేస్తుందని ఆశిస్తున్నారు. అయితే ఈ ఏడాది వరల్డ్ కప్‌లో పోటీలకు ముందుగానే 8 జట్లు అర్హత పొందిన విషయం మనకు తెలిసిందే. ఇక వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసిన నెదర్లాండ్స్, శ్రీలంక జట్లు ఆఖరి రెండు బెర్తులు దక్కించుకున్నాయి. మాజీ చాంపియన్ వెస్టిండీస్, లీగ్ దశలో ఆకట్టుకున్న జింబాబ్వే జట్లు అనూహ్యంగా రేసు నుండి తప్పుకున్నాయి.
ఇప్పుడు ఈ మెగా టోర్నీలో భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తలపడున్నాయి. ప్రతి టీం కూడా మిగతా తొమ్మిది జట్లతో తలపడనుంది. ఈ సారి టోర్నీ మరింత రసవత్తరంగా ఉంటుందని తెలుస్తుంది. 2023 ప్రపంచ కప్ పూర్తి షెడ్యూల్ జూన్ 27న విడుదల కాగా, ఈ సారి మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబరు 5 నుంచి 2023 ఐసీసీ ప్రపంచకప్ టోర్నీ మొదలుకానుండగా, తొలి మ్యాచ్‌లో గతసారి ఫైనల్లో తలపడిన ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ పోటీ పడనున్నాయి. ఇక చివరి మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. అయితే ఈ టోర్నీ టిక్కెట్ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత బయటకు రాలేదు.
ప్రపంచ కప్ కి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలి, ధర ఎంత ఉంటుందనే దానిపై శోధన చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు టిక్కెట్స్ కి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. దాదాపు టిక్కెట్స్ అన్నీ ఆన్‌లైన్‌లోనే ఉంచనున్నారని సమాచారం. ఐసీసీ వెబ్ సైట్స్ లో టిక్కెట్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. బుక్‌మైషో, పేటీఎంలో కూడా టిక్కెట్లు సేల్‌కు ఉంచనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక టిక్కెట్ ధరలు వేదికలని బట్టి మారుతుంటాయి. దాదాపు 500ల రూపాయాల నుంచి . 10వేల రూపాయాల వరకు ఉండవచ్చని అంచనా. ఈ వరల్డ్ కప్ టోర్నీ మొత్తం 10 స్టేడియాల్లో జరగనుండగా, కీలకమైన మ్యాచ్ అంటే భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుండగా,టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం ఖాయం.