ICC World Cup 2023 | ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ ట్రోఫీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎవరూ ఊహించని విధంగా ఆవిష్కరించింది. భూమికి 1,20,000 అడుగుల ఎత్తులో స్ట్రాటోస్పియర్‌లో మైనస్ 65 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆవిష్కరించగా.. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సెక్రెటరీ జైషా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా జై షా స్పందిస్తూ క్రికెట్ వరల్డ్ కప్ 2023 ట్రోఫీని అంతరిక్షంలో ఆవిష్కరించడం క్రికెట్ ప్రపంచానికి అపూర్వ క్షణమని పేర్కొన్నారు. ఐసీసీ మెగా ఈవెంట్ భారత్‌లో అక్టోబర్ – నవంబర్ మధ్య జరుగనున్నది.
ఇవాళ టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. వన్డే ప్రపంచక కప్ టోర్నీ టూర్‌ను ఐసీసీ ఘనంగా ప్రారంభించనున్నది. ట్రోఫీ కువైట్, బహ్రెయిన్, మలేషియా, అమెరికా, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ, ఆతిథ్య భారత్ సహా 18 దేశాలకు వెళ్లనున్నది. ఈ పర్యటనలో లక్షలాది మంది క్రికెట్ అభిమానులు వివిధ కార్యక్రమాల్లో ట్రోఫీని వీక్షించేందుకు అవకాశం ఉన్నది. ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీ టూర్ ఓ కీలకమైన మైలురాయిని సూచిస్తుంది అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ అన్నారు.
క్రికెట్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారని, వీలైనంత ఎక్కు వమంది ఈ ట్రోఫీని దగ్గరగా చూడాలని తాము కోరుకుంటున్నామన్నారు. బీసీసీఐ సెక్రెటరీ జైషా స్పందిస్తూ ఇతర క్రీడల కంటే క్రికెట్ దేశాలను కలుపుతుందన్నారు. దేశంలో ఉత్కంఠ వాతావరణం ఉందని, ప్రపంచంలోని పది అత్యుత్తమ జట్లతో ఆరువారాల క్రికెట్ ప్రపంచ కప్‌ను నిర్వహించేందుకు ఎదురు చూస్తున్నామన్నారు. ట్రోఫీ టూర్‌లో అభిమానులకు మెగా ఈవెంట్ భాగం అయ్యేందుకు ఇదే ఉత్తమ అవకాశమని పేర్కొన్నారు.
The #CWC23 Trophy in space