లాస్య నందిత సీటు బెల్టు పెట్టుకుని ఉంటే! న్యూటన్‌ ఫస్ట్‌ లా ప్రకారం..

ఒక్కోసారి చిన్నచిన్న పొరపాట్లే అనూహ్య ఘటనలకు దారి తీస్తుంటాయి. ఏమీకాదులే అన్న నమ్మకం

  • Publish Date - February 23, 2024 / 10:18 AM IST

విధాత ప్రత్యేకం: ఒక్కోసారి చిన్నచిన్న పొరపాట్లే అనూహ్య ఘటనలకు దారి తీస్తుంటాయి. ఏమీకాదులే అన్న నమ్మకం కావచ్చు.. ఎప్పుడూ పెట్టుకోలేదుగా? అనే ధీమా కావచ్చు! కొంతమంది కారులో ప్రయాణం చేసేటప్పుడు సీటు బెల్టు పెట్టుకోవడానికి అంతగా ఇష్టపడరు. కానీ.. మృత్యువు ఏ రూపంలో పొంచి ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఒక అంచనా ప్రకారం దేశంలో 70 శాతం మందికిపైగానే వెనుక సీటులో కూర్చొనేవారు సీటు బెల్టు పెట్టుకోరట. నిజానికి డ్రైవింగ్‌ సీటులో ఉన్నవారు, ఫ్రంట్‌ సీటులో కూర్చునేవారు సీటు బెల్టు పెట్టుకునేవారు ఎక్కువ మందే ఉన్నా.. వెనుక సీట్లో మాత్రం అసలు అవసరమే లేదన్న ధీమాతో ఉంటుంటారు. 

ఒకప్పుడు కారు విలాస వస్తువు అయినా.. ఈ మధ్యకాలంలో అవసరంగా మారుతున్నది. దీంతో మధ్యతరగతివారు సైతం చిన్నదైనా సరే ఒక కారును కొనుక్కుంటున్నారు. నిజానికి సీటు బెల్టు పెట్టుకుంటే ఎక్కువ సందర్భాల్లో ప్రాణాపాయం తప్పుతుందని రోడ్డు సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. టాటా సన్స్‌ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ ఇలా వెనుక సీట్లో సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే చనిపోయారు. ఇప్పుడు లాస్య నందిత కూడా సీటు బెల్టు పెట్టుకుని ఉంటే బతికి ఉండేదేమో. 

ప్రమాదం జరిగినప్పుడు దేహానికి దెబ్బలు తగలకుండా కాపాడేందుకే సీటు బెల్టు ఉంటుంది. ఇందులో న్యూటన్‌ సిద్ధాంతం కూడా ఉంది. న్యూటన్‌ ఫస్ట్‌ లా ప్రకారం ఎప్పుడైతే కారు.. ఉన్నట్టు ఆగిపోతుందో లేదా దేన్నైనా ఢీకొంటుందో ఆ సమయంలో చలనం యెక్క జడత్వం కారణంగా సీటులో కూర్చున్నవారు ముందుకు నెట్టబడతారు. ఆ సమయంలో వారికి ఎదురుగా ఏది ఉంటే దాన్ని బలంగా ఢీకొంటారు. సాధారణంగా ఇటువంటి ప్రమాదాల్లో తల నుదురు భాగం విసురుగా వెళ్లి తగులుకుంటుంది. అదే ఫ్రంట్‌ సీట్‌లో ఉన్నవారు నేరుగా అద్దాన్ని ఢీకొంటారు. సీటు బెల్టు దానిని నివారిస్తుంది. 

సైరస్‌ మిస్త్రీ మరణం కూడా సీటు బెల్టు ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నది. నిజానికి వెనుక సీట్లో ఉన్నవారు కూడా సీటు బెల్టు పెట్టుకోవడం తప్పనిసరి అని కేంద్ర మోటర్‌ వాహనాల నిబంధనలు (సీఎంవీఆర్‌) స్పష్టం చేస్తున్నాయి. రూల్‌ నంబర్‌ 138 (3) ప్రకారం.. వాహనం కదులుతున్న సమయంలో ఎదుటి సీట్లలోనివారు, వెనుక సీట్లలోనివారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలి. సీటు బెల్టు పెట్టుకోనివారికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. 

సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల ప్రాణాపాయాన్ని 25 శాతం వరకూ తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నది. కొన్ని దేశాల్లో అధ్యయనాలు 50శాతానికిపైగా మరణాలను నివారిస్తాయని పేర్కొంటున్నాయి. 

సో.. మరో ముచ్చటే లేకుండా.. కారు ఎక్కగానే ముందు సీట్లోనివారు, వెనుక సీట్లో కూర్చున్నవారు సైతం సీటు బెల్టులు పెట్టేసుకోండి. రిస్క్‌ ఎందుకు చెప్పండి! రోడ్డు భద్రత విషయంలో చిన్న పాయింట్‌ అయినా.. లెక్కలోకి వస్తుంది. గుర్తుంచుకోండి!

ఇవి గుర్తు పెట్టుకోండి

– ప్రాణాపాయాన్ని లేదా తీవ్ర గాయాలను నివారిస్తుంది.

– తల, మొండెం, కాళ్లు, చేతులకు గట్టి దెబ్బలు తగలకుండా కాపాడుతుంది. 

– మెడ సంబంధమైన గాయాలు కాకుండా చూస్తుంది. 

– చట్టపరమైన సమస్యలను నివారిస్తుంది. 

– సీటు బెల్టు పెట్టుకుని ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే.. డ్రైవర్‌ స్టీరింగ్‌ మీద పట్టు తప్పకుండా చూస్తుంది. 

– ఏ ఒక్క భాగమో కాకుండా.. మొత్తం శరీరాన్ని సమానంగా అదిమి ఉంచుతుంది. 

– ప్రమాద సమయంలో తెరుచుకునే ఎయిర్‌ బ్యాగ్‌లు సీటు బెల్టు పెట్టుకునే దానిని బట్టే మనల్ని కాపాడుతాయి.

Latest News