Site icon vidhaatha

IND vs SL: 4597 రోజుల తర్వాత వాంఖడే వేదిక‌గా భార‌త్-శ్రీలంక మ్యాచ్.. గుర్తుకొస్తున్న పాత జ్ఞాపకాలు

IND vs SL: 1983లో వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించిన భార‌త జ‌ట్టు ఆ త‌ర్వాత మ‌ళ్లీ వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించేందుకు 28 ఏళ్లు ప‌ట్టింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో 2011 ఐసీసీ ప్రపంచ కప్‌లో జరిగిన శిఖరాగ్ర పోరులో శ్రీలంక పేసర్ నువాన్ కులశేఖర వేసిన బంతికి వికెట్ కీపర్-బ్యాటర్ ఎంఎస్ ధోని ఒక భారీ సిక్సర్ కొట్టి భార‌తీయుల‌కి మ‌ర‌చిపోలేని క్ష‌ణాల‌ని అందించాడు. ఆ స‌మ‌యంలో ర‌విశాస్త్రి చెప్పిన మాటలు ఇప్పటికీ ప్రతి భారతీయ క్రికెట్ అభిమాని చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.ఆ రోజు గౌతమ్ గంభీర్ (97) యొక్క వీరోచిత ఇన్నింగ్స్‌తో పాటు ధోని (91*) అసాధారణమైన నాక్‌తో భారతదేశం 28 సంవత్సరాల తర్వాత ప్రపంచ కప్ ట్రోఫీని అందుకుంది.

మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌ర్వాత భార‌త్‌లో ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ సారి అదే హిస్ట‌రీ రిపీట్ చేస్తారేమోన‌ని ప్ర‌తి ఒక్క క్రికెట్ అభిమాని ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం 2023 వ‌ర‌ల్డ్ కప్ క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్‌లు జ‌రుగుతుండ‌గా, ఆదివారం శ్రీలంక-జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో 2023 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ప్రపంచకప్‌లో ఆడుతున్న 10 జట్లలో 9వ జట్టుగా ప్రపంచయుద్ధంలోకి దిగుతున్న శ్రీలంక‌… 4597 రోజుల తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియంలో భార‌త్‌తో మ్యాచ్ ఆడ‌బోతుంది.

సరిగ్గా 12 ఏళ్ల క్రితం వాంఖ‌డే మైదానంలో భార‌త్ – శ్రీలంక‌లు వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పోటీప‌డ‌గా, ఇందులో గెలిన భార‌త్ క‌ప్ ద‌క్కించుకోవ‌డం మ‌నం చూశాం .. ఇప్పుడు ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో జింబాబ్వేను ఓడించి ప్రపంచకప్ టిక్కెట్‌ను దక్కించుకున్న శ్రీలంక, వాంఖడే స్టేడియంలో న‌వంబ‌ర్ 2న‌ భారత్‌తో తలపడనుంది. 2011లో ఏప్రిల్ 2న ఈ జ‌ట్లు త‌ల‌ప‌డ‌గా, ఈ ఏడాది న‌వంబ‌ర్ 2న ముంబైలోని వాంఖ‌డేలో పోటీ ప‌డ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. మ‌రి ఈ మ్యాచ్‌లో ఎవ‌రు గెలుస్తారా అనే చ‌ర్చ ఇప్పుడు మొద‌లైంది.

Exit mobile version