అమెరికాలో భార‌త సంత‌తి వ్యాపార‌వేత్త‌ దుర్మ‌ర‌ణం

అగ్ర‌రాజ్యం అమెరికాలో భార‌త సంత‌తి విద్యార్థులపై వ‌రుస దాడులు, మ‌ర‌ణాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. నెల రోజుల వ్య‌వ‌ధిలోనే అమెరికాలోఆరుగురు భార‌తీయులు చ‌నిపోయారు

  • Publish Date - February 10, 2024 / 08:52 AM IST

  • వాషింగ్టన్ వీధిలో దాడికి గురైన
  • రెండ్రోజుల క్రిత‌మే హైద‌రాబాదీపై దాడి
  • నెల రోజుల్లోనే ఏడుగురు ఎన్నారైల మ‌ర‌ణం


విధాత‌: అగ్ర‌రాజ్యం అమెరికాలో భార‌త సంత‌తి విద్యార్థులపై వ‌రుస దాడులు, మ‌ర‌ణాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. నెల రోజుల వ్య‌వ‌ధిలోనే అమెరికాలోఆరుగురు భార‌తీయులు చ‌నిపోయారు. తాజాగా మ‌రొక‌రు ప్రాణాలు కోల్పోయారు. వాషింగ్టన్ వీధిలో దాడికి గురైన 41 ఏండ్ల భార‌త‌ సంతతి వ్యాపార‌వేత్త గుర్తుతెలియ‌ని దుండ‌గుడి దాడిలో క‌న్నుమూశాడు. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగుచూసింది పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..


వివేక్ త‌నేజా.. అమెరికా ప్రభుత్వానికి సాంకేతిక స‌హ‌కారం అందిస్తున్న‌ ఉత్పత్తి ప్రొవైడర్ అయిన డైనమో టెక్నాలజీస్‌కు సహ వ్యవస్థాపకుడు. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, త‌నేజా కంపెనీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఆయ‌న వ‌ర్జీనియాలో ఉంటున్నారు. ఈ నెల రెండో తేదీన ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన త‌నేజా రాత్రి 2 గంట‌ల ప్రాంతంలో బ‌య‌ట‌కు వ‌చ్చాడు. వీధిలో ఒంట‌రిగా న‌డుచుకుంటూ వెళ్తున్న ఆయ‌న‌తో గుర్తు తెలియ‌ని దుండ‌గుడు గొడ‌వ పెట్టుకొని దాడిచేశాడు. పేవ్‌మెంట్‌పై ప‌డేసి త‌ల‌పై కొట్ట‌డంతో త‌నేజా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకొని బాధితుడిని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అనంత‌రం చికిత్స పొందుతూ బుధ‌వారం త‌నేజా తుదిశ్వాస విడిచారు.


అగంతకుడికి, త‌నేజా మధ్య గొడ‌వ జ‌రుగ‌డానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఫొటో విడుద‌ల చేసిన పోలీసులు.. అత‌డి ఆచూకీ తెలిపిన వారికి 25 వేల డాల‌ర్ల న‌జ‌రానా ప్ర‌క‌టించారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.


అమెరికాలో భార‌తీయ సంత‌తి విద్యార్థుల‌పై దాడులు, మరణాల మధ్య తాజాగా వెలుగుచూసిన వ్యాపార‌వేత్త మ‌ర‌ణం ఎన్నారైల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది. అమెరికాలోని చికాగో రాష్ట్రంలో ఈ వారం ప్రారంభంలో కొంద‌రు దుండ‌గులు హైద‌రాబాద్‌కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీ అనే వ్యక్తి యువ‌కుడిపై దాడిచేశారు. విద్యార్థి ముక్కు, నోటి నుంచి తీవ్ర ర‌క్తం కారుతుండ‌గా స‌హాయం కోసం అర్థిస్తున్న‌వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


నెల రోజుల్లోనే ఏడుగురు దుర్మ‌ర‌ణం


ఈ ఏడాదిలో అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు ఏడుగురు భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు మరణించారు. పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ అమెరికన్ సమీర్ కామత్ ఈ వారం చనిపోయాడు. అమెరికన్ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉన్న 19 ఏండ్ల‌ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెనిగర్ గత వారం చనిపోయినట్టు గుర్తించారు. నీల్ ఆచార్య అనే మరో విద్యార్థి ఆ వారం ప్రారంభంలో పర్డ్యూ యూనివర్శిటీ క్యాంపస్‌లో చనిపోయాడు.


హర్యానాకు చెందిన 25 ఏళ్ల విద్యార్థి వివేక్ సైనీ జనవరి 16న జార్జియాలోని లిథోనియాలో నిరాశ్రయులైన వ్యక్తి చేతిలో కొట్టి చంపబడ్డాడు. మరో భారతీయ విద్యార్థి అకుల్ ధావన్ జనవరిలో వర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ వెలుపల శవమై కనిపించాడు. జ‌న‌వ‌రి నెల‌లో ఐదుగురు చ‌నిపోగా, ఫిబ్ర‌వ‌రి ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం చెందారు. వ‌రుస ఘ‌ట‌నల నేప‌థ్యంలో అమెరికాలో భార‌త విద్యార్థుల భ‌ద్ర‌త‌పై భార‌తీయుల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.

Latest News