విధాత : ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో దారుణం జరిగింది. ఓ భారతీయ విద్యార్థి కత్తిపోట్లకు గురయ్యాడు. ఆ స్టూడెంట్ శరీరంపై 11 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన శుభం గార్గ్(28) ఐఐటీ మద్రాస్‌లో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశాడు. పీహెచ్‌డీ కోసం సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఈ క్రమంలో శుభం సెప్టెంబర్ 1న ఆస్ట్రేలియాకు వెళ్లాడు.
అయితే అక్టోబర్ 6వ తేదీన రాత్రి 10:30 గంటల సమయంలో శుభం బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి.. శుభంను అడ్డగించాడు. డబ్బులు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వనని చెప్పడంతో, కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి స్టూడెంట్‌పై 11 సార్లు కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం అతను పారిపోయాడు. ముఖం, ఛాతీ, పొత్తికడుపుపై తీవ్ర గాయాలు కావడంతో, అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు స్థానికులు. శుభంపై దాడి చేసిన 27 ఏండ్ల యువకుడిని సిడ్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.