Lok Sabha | 5 అసెంబ్లీలతో లోక్‌సభ ముందస్తు? కలిసొస్తే ఒడిశా, మహారాష్ట్రలోనూ!

Lok Sabha | మరింత ఊపందుకుంటున్న ప్రచారం మొన్న మమత, నిన్న నితీశ్‌ సందేహం విపక్షాల ‘ఇండియా’తో బీజేపీలో గుబులు ఐదు రాష్ట్రాల్లో 83 లోక్‌సభ స్థానాలు ఒడిశా, మహారాష్ట్ర కలుపుకొంటే 150 5 రాష్ట్రాల్లో ఎదురుగాలి వీస్తే.. కష్టాలే ముందే ఎదురెళ్లే వ్యూహంలో మోదీ! నెలాఖరుకల్లా తేలిపోనున్న ముచ్చట (విధాత ప్రత్యేకం) లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరగొచ్చనే ప్రచారం ఊపందుకుంటున్నది. ఈ ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాలు.. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం […]

  • Publish Date - August 31, 2023 / 01:00 AM IST

Lok Sabha |

  • మరింత ఊపందుకుంటున్న ప్రచారం
  • మొన్న మమత, నిన్న నితీశ్‌ సందేహం
  • విపక్షాల ‘ఇండియా’తో బీజేపీలో గుబులు
  • ఐదు రాష్ట్రాల్లో 83 లోక్‌సభ స్థానాలు
  • ఒడిశా, మహారాష్ట్ర కలుపుకొంటే 150
  • 5 రాష్ట్రాల్లో ఎదురుగాలి వీస్తే.. కష్టాలే
  • ముందే ఎదురెళ్లే వ్యూహంలో మోదీ!
  • నెలాఖరుకల్లా తేలిపోనున్న ముచ్చట

(విధాత ప్రత్యేకం)
లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరగొచ్చనే ప్రచారం ఊపందుకుంటున్నది. ఈ ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాలు.. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికలతోపాటే లోక్‌సభ ఎన్నికలు జరగవచ్చనే అనుమానాలు మొన్న పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యక్తం చేయగా.. తాజాగా బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ కూడా నిర్ణీత గడువు కంటే ముందే జరిగే అవకాశం ఉన్నదని చెప్పారు. దీనికి కారణం కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడినాయి.

ఈ కూటమి నేతలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై బీజేపీ సర్కార్‌ను ఎదుర్కొవడానికి అనుసరించాల్సిన వ్యూహాలను, ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా ఎదురయ్యే సమస్యలపై ఎలా ముందుకు వెళ్లాలన్న అన్నవాటిపై చర్చించారు. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట కాంగ్రెస్‌ పార్టీ వాటికి మద్దతు ఇవ్వాలని, కాంగ్రెస్‌ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పోటీకి దూరంగా ఉండాలనే అభిప్రాయాన్ని గతంలోనే మమతా బెనర్జీ ప్రతిపాదించారు.

బీహార్‌, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారపార్టీలో భాగస్వామిగానే ఉన్నది. కర్ణాటకలో చేదు ఫలితాలను చవిచూసిన కమలనాథులు ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ప్రతికూల ఫలితాలు వస్తే ఆ ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడుతుందని భావిస్తున్నది. ఎందుకంటే 2018లో ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధించింది. ఆ తర్వాతి రాజకీయ పరిణామాలతో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడి బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఒడిశాలోనూ..

కొంతకాలం కిందట జమిలి ఎన్నికల అంశం పై చర్చ జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఐదు రాష్ట్రాలతో పాటు ఇంకో ఒకటి రెండు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగతాయా? అంటే ఔననే సమాధానం వస్తున్నది. ఒడిశాలోనూ ముందస్తు ఎన్నికలు జరగవచ్చు అంటున్నారు. ఆగస్టు మొదటి వారంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో బీజేడీ సీనియర్‌ నేత భేటీ అయ్యారు.అప్పుడే సీఎం ఢిల్లీ పర్యటనపై గురించి మాట్లాడారు. ఆ సందర్భంగానే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఒక జాతీయ మీడియాకు చెప్పారు.

ఆ తర్వాత ఈ నెల రెండోవారంలో ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రధానితో సమావేశమయ్యారు.వివిధ పథకాలకు సంబంధించి రాష్ట్ర క్యాబినెట్‌ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఆగస్టు చివరి లేదా సెప్టెంబర్‌ మొదటివారంలో అసెంబ్లీ వర్షకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే రూ.25,000 కోట్ల అనుబంధ బడ్జెట్‌ను సమర్పించనున్నదని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ అసెంబ్లీకి ఇదే చివరి సమావేశాలు కావొచ్చు అని సమాచారం.

మహారాష్ట్రలోనూ..

మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాఢీ (శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ) ప్రభుత్వాన్ని కూలదోసి శివసేన (ఏక్‌నాథ్‌ శిండేవర్గం)తో కలిసి బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకున్నది. ఈ కూటమిలోని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఇండియా కూటమిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్కడి సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి, శివసేనలో చీలిక తెచ్చిన బీజేపీ అనంతరం ఎన్సీపీలోనూ చిచ్చు పెట్టింది. ఏక్‌నాథ్‌ నేతృత్వంలో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోలేమని, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు తోడు అజిత్‌పవార్‌ను కలుపుకొటే మెరుగైన సీట్లు దక్కించుకోవచ్చని బీజేపీ అధిష్ఠానం అంచనా వేసింది.

దానికి అనుగుణంగానే పావులు కదిపి అక్కడ మహా వికాస్‌ అఘాఢీ కూటమిలోని రెండు పార్టీల్లో సంక్షోభాన్ని సృష్టించింది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్నా ఏక్‌నాథ్‌ వర్గాన్ని బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదు. దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం చేయాలని ప్రకటనలు చేస్తున్నారు. కొంతకాలంగా ఇది జరుగుతున్నా.. కేంద్రంలోని పెద్దలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో అక్కడ ప్రభుత్వ మనుగడ బీజేపీ పెద్దలపై ఆధారపడి ఉన్నది. మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌ అంటున్నట్టు ఐదు రాష్ట్రాలతో పాటు లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిగితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు.

లోక్‌సభకు ముందస్తు ఎందుకు?

ఐదు రాష్ట్రాల్లోని రాజస్థాన్‌లో (25), మధ్యప్రదేశ్‌ (29), ఛత్తీస్‌గఢ్‌ (11), తెలంగాణ (17), మిజోరాం (1)లో 83 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒడిశా ప్రభుత్వం కూడా సిద్ధమైతే మరో 21 స్థానాలు, మహారాష్ట్ర (48) కలుపుకొంటే 150 స్థానాలకు పైగా ఉంటాయి. గత తొమ్మిదిన్నరేళ్ల కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధి కంటే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ.. మత విద్వేషాలు రెచ్చగొడుతూ.. ప్రజా ప్రభుత్వాలను కూల్చివేస్తూ.. కాలం వెళ్లదీస్తున్నదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు విపక్ష కూటమి ఐక్యంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే కష్టమే అనే అభిప్రాయం కాషాయ పార్టీ అగ్రనేతల్లో ఉన్నది.

అందుకే సాధ్యమైనంత తర్వగా ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన వారిలో ఉన్నది. పెరిగిన నిత్యావసర వస్తువులకు తోడు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపుతో పేద, మధ్య తరగతి ప్రజానీకంపై మోదీ ప్రభుత్వం భారాన్ని మోపిందని విపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ప్రధానాస్త్రంగా కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం బీజేపీకి అనుకూల వాతావరణం లేదు.

అలాగే కేంద్రంలో రెండు సార్లు బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించిన మోదీ ప్రభ కూడా తగ్గిపోయింది. అందుకే గ్యాస్‌ ధర రూ. 200 తగ్గించిందనే వాదనలు ఉన్నాయి. అంతేకాదు ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని బీఆర్‌ఎస్‌, బీజేడీలు, వైసీపీ వంటి పార్టీలు ఒకవేళ కేంద్రంలో అనుకున్న మెజారిటీ రాకపోతే సహకరించవచ్చు అంటున్నారు. అందుకే మోడీ ప్రభుత్వం ముందస్తు కు వెళ్తుందనే ప్రచారం జరుగుతున్నది. కాబట్టి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరుగతాయా అన్నది సెప్టెంబర్‌ చివరి వారంలో లేదా అక్టోబర్‌ మొదటి వారంలో తేలుతుంది.

Latest News