Site icon vidhaatha

Mahashivratri | శివాలయంలో ఎలా ప్రదక్షిణ చేయాలో తెలుసా? ఇలా ఒక్కసారి చేసినా పదివేల సార్లు చేసినట్లే..!

Mahashivratri | ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా ఆలయం చుట్టూ.. లేదా మూలవిరాట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తాం.. ప్రదక్షిణ తర్వాతనే లోనికి వెళ్తాం.. ప్రదక్షిణ చేయడంలోనూ కొన్ని నియమాలు ఉన్నాయి. అందులో భోళాశంకరుడికి చేసే ప్రదక్షిణ మరీ ప్రత్యేకం. అదేంటో తెలుసుకుందాం..!

దాదాపు శివుడిని రోజూ పూజిస్తారు. నెలనెలా వచ్చే మాస శివరాత్రికి.. మాఘమాసంలో వచ్చే మహా శివరాత్రికి ఎంతో తేడా ఉంటుంది. సనాతన హిందూ మతంలో అత్యంత సులభంగా ప్రసన్నుడయ్యే దేవుడిగా శివుడికి పేరుంది. చిత్తశుద్ధితో జలం, బిల్వ పత్రం సమర్పిస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడు. శివుడికి పూజలో మాత్రమే కాదు.. ప్రదక్షిణలోనూ కొన్ని నియమాలు ఉన్నాయి. శివాలయంలో ప్రదక్షిణ చేసే విధానాన్ని శివ పురాణంలో పేర్కొన్నారు. శివాలయంలో చేసే ప్రదక్షిణ అన్ని దేవాలయాలకంటే భిన్నంగా ఉంటుంది. ఇతర దేవాలయాల్లో చేసే విధంగా ఈశ్వరుని ఆలయంలో ప్రదక్షిణ చేయకూడదు.. శివాలయంలో చేసే ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అంటారు.

చండీ ప్రదక్షిణ అంటే..

శివాలయంలో ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణ ప్రారంభించి చండీశ్వరుని వరకు వెళ్లి.. అక్కడ చండీశ్వరుని దర్శించుకొని తిరిగి మళ్లీ ధ్వజస్తంభం వద్దకు చేరుకోవాలి. ధ్వజస్తంభం వద్ద ఒక్క క్షణం ఆగి మళ్లీ ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం నుంచి అభిషేక జలం వెళ్లే దారి వరకూ అక్కడ నుంచి తిరిగి మళ్లీ నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి అవుతుంది. ఈ విధంగా చేసే ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు. ప్రదక్షిణ చేసే సమయంలో సోమసూత్రాన్ని దాటి వెళ్లకూడదు. సోమసూత్రం నుంచి ఆలయంలో చేసిన అభిషేక జలం బయటకు వెళ్తుంది. అంతేకాదు అక్కడ శివ ప్రమధగణాలు ఉంటాయి. ఈ జలం దాటి చేసే ప్రదక్షిణ ఫలితం ఇవ్వదని పురాణాలు పేర్కొన్నాయి. చండీ ప్రదక్షిణం పదివేల సాధారణ ప్రదక్షిణలతో సమానమని శివపురాణంలో పేర్కొన్నారు. ఇలా మూడు ప్రదక్షణాలు చేయాలి.

శివుడికి, నందికి మధ్య నడవకూడదు

తెలిసీ తెలియక శివాలయంలో శివయ్యకు, నందికి మధ్య నడవకూడదు. నందీశ్వరుడు శివయ్యను చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన దృష్టికి ఎవరూ అడ్డు వెళ్లరాదు. నందీశ్వరుడి వెనుక నుంచి వెళ్లాలి. విగ్రహానికి ఎదురుగా నిలబడి దర్శనం కూడా చేసుకోకూడదు. విగ్రహం నుంచి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి. వాటి శక్తిని మనం భరించలేం కాబట్టి దైవాన్ని పక్కన నిలబడే దర్శనం చేసుకోవాలి.

Exit mobile version