Site icon vidhaatha

అంతా నా ప‌ని అయిపోయింద‌న్నారు.. ఇప్పుడు ర్యాంప్ ఆడిద్దాం: మంచు మ‌నోజ్ కొత్త టాక్‌షో

మంచు ఫ్యామిలీకి చెందిన స్టార్స్ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఎంత దారుణంగా ట్రోల్ బారిన ప‌డుతున్నారో చూస్తున్నాం. మంచు మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మీ, మంచు విష్ణుల‌ని ఓ ఆటాడేసుకుంటున్నారు నెటిజ‌న్స్. అయితే మ‌నోజ్ మాత్రం కొద్దిగా ఈ ట్రోలింగ్‌కి దూరంగానే ఉంటారు. మంచు మనోజ్ ఐదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న విష‌యం తెలిసిందే. వ‌రుస సినిమాలు బ్రేక్ కావ‌డంతో చాలా గ్యాప్ తీసుకున్న మ‌నోజ్ త్వ‌ర‌లో అహం బ్ర‌హ్మ‌స్మి అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించేందుకు రెడీ అయ్యాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఓటీటీలో కూడా సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా డిజిటల్‍లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్టు తాజాగా తెలియ‌జేశాడు.

కెమెరా ముందుకు వచ్చి నమస్కరిస్తున్న ఫొటోలను షేర్ చేసిన మంచు మనోజ్.. కళామ్మ‌తల్లి ముందుకు వచ్చినట్టు తెలిపారు. హోస్ట్ గా వ్యవహరిస్తూ సరికొత్త రియాలిటీ షోతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌బోతున్న‌ట్టు తెలియ‌జేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా మరియు ఈటీవీ విన్ నుంచి ఈ రియాలిటీ గేమ్ షో రాబోతుండ‌గా, దీనిని మంచు మనోజ్ త‌న‌దైన శైలిలో న‌డిపించ‌నున్నాడు. తాజాగా రియాలిటీ గేమ్ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేయ‌గా, ఈ ప్రోమో అనేక ప్ర‌శ్న‌ల‌కి సమాధానం ఇచ్చింది.

మనోజ్ వాయిస్ ఓవర్ తో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నట్టుగా వీడియో ఉండ‌గా, ఇందులో… ‘నా ప్రపంచం మొత్తం సినిమా. నేను చిన్నప్పట్నుంచి పెంచుకున్న సినిమా మీద పెంచుకున్న ప్రేమ నా ప్రొఫెషన్ గా మారింది. నన్ను ఒక నటుడిగా, హీరోగానూ చేసింది. రాకింగ్ స్టార్ అనే బిరుదునూ ఇచ్చింది. ఫ్యాన్స్, విజిల్స్, అరుపులు, కేకలు ఇలా పండగలా జరిగిన నా లైఫ్ లోకి సడెన్ గా ఓ సైలెన్స్ వచ్చింది. మనోజ్ అయిపోయ్యారు అన్నారు. కెరీర్ ఖతం అన్నారు.

యాక్టింగ్ ఆపేశారు. తిరిగి రారు అన్నారు. ఎనర్జిటిక్ రాక్ లో ఎనర్జి లేదన్నారు. విన్నాను, మౌనంగా భరించాను.. తిరిగి వస్తున్నాను.’ అంటూ మనోజ్ వాయిస్ అందించారు. ప్రోమో చూస్తుంటే ఈ గేమ్ షోకు మనోజ్ జీవితానికి ఏమైనా సంబంధం ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక మంచు మ‌నోజ్ ‘వాట్ ది ఫిష్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు ర‌వితేజ,విశ్వక్ సేన్ కాంబోలో రాబోతున్న చిత్రం కూడా చేయ‌నున్నాడు. ఇందులో మ‌నోజ్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడ‌నే ప్ర‌చారం కూడా నడుస్తుంది. ఏది ఏమైన మనోజ్ తన అభిమానులను అలరించేందుకు వరుస ప్రాజెక్ట్స్ తో సిద్ధం అవుతుండ‌డం శుభ ప‌రిణామం.

Exit mobile version