Site icon vidhaatha

Myanmar | మయన్మార్‌లో పెచ్చుమీరుతున్న సైన్యం ఆగడాలు..! బాంబుల దాడిలో 100 మంది పౌరులు మృతి..!

Myanmar | మయన్మార్‌లో సైన్యం ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. సెంట్రల్ ఏరియా సాగెయింగ్‌లోని కాంట్ బాలు టౌన్ షిష్‌లో సైన్యం జుంటా బాంబులతో దాడులు జరిపింది. ఈ ఘటనలో చిన్నారులు, మహిళలు సహా వంద మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సైనిక పాలనకు వ్యతిరేకంగా కార్యక్రమం నిర్వహించగా.. జూటా దాడులు జరిపినట్లుగా తెలుస్తున్నది. కనీసం వంద మంది మృతి చెందారని, మరికొందరు గాయపడినట్లుగా సమాచారం. దాడి ఘటనను ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఖండిస్తున్నాయి. జుంటా ఎయిర్ క్రాఫ్ట్ నుంచి నిరసనకారులపై మయన్మార్ సైన్యం రెండు బాంబులు జారవిడిచిందని స్థానిక మీడియా తెలిపింది.

ఆర్మీ దాడిలో చాలా మంది అమాయకులు మరణించారని, ఇందులో చిన్నారులు, మహిళలు, గర్భిణులు ఉన్నారని నేషనల్‌ యూనిటీ గవర్నమెంట్ (NUG) కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దాడిని హేయమైన చర్యగా అభివర్ణించింది. స్థానికంగా కొత్త ఆఫీస్‌ ప్రారంభించనున్న సందర్భంగా ప్రజలు గుమిగూడడంతో.. జుంటా యుద్ధ విమానాల నుంచి బాంబులతో దాడి చేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దాడిలో ప్రతిపక్ష గ్రూప్ నేషనల్ యూనిటీ గవర్నమెంట్ (NUG) కార్యాలయం ధ్వంసమైంది.

బాంబు పేలుడు జరిగిన సమయంలో మహిళలు, పిల్లలు సహా 150 మందికిపైగా వేడుకల్లో పాల్గొన్నారు. మృతుల్లో సైనిక పాలనను వ్యతిరేకిస్తున్న సాయుధ గ్రూపులు, ఇతర రాజకీయ నేతలు సైతం ఉన్నారు. సైనిక తిరుగుబాటు తర్వాత 3వేల మందికిపైగా పౌరులు సైన్యం చేతుల్లో బలయ్యారని అంచనా. ఫిబ్రవరి 2021లో మయన్మార్‌ సైన్యం తిరుగుబాటు చేస్తూ అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి దేశంలో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తిరుగుబాటుదారులను సైన్యం అణచివేస్తోంది. మయన్మార్‌ సైన్యం చర్యలను మానవహక్కుల సంఘం సహా పలు దేశాలు ఖండించాయి.

Exit mobile version