Nandi Awards | ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు సినిమాలకు ప్రభుత్వం ఏటా నంది పురస్కారాలను ప్రకటించింది. తెలుగు చరిత్ర, కళలకు ప్రతీకల్లో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలు, కళాకారులకు పురస్కారాలు ఇచ్చేది. ఈ సంప్రదాయం 1964 సంవత్సరంలో ప్రారంభమైంది. మొదట బంగారు, రజత, కాంస్య నందులను ప్రభుత్వం ఇచ్చేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. ఆ తర్వాత నంది అవార్డుల ప్రకటన నిలిచింది.
దాంతో చాలామంది నటీనటులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నది అవార్డులు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నది. తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో.. ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుకలను దుబాయిలో అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు ఖచ్చితంగా నంది అవార్డులు ఇవ్వాలన్నారు. ఇప్పటికే ప్రముఖ టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీకృష్ణ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన వ్యాఖ్యలపై నిర్మా తమ్మారెడ్డి భరద్వాజ సైతం స్పందించారు. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ సైతం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా నంది అవార్డులు ఇవ్వాలని, తద్వారా ఇక్కడి పర్యాటకరంగం మరింత అభివృద్ధి చెందుతుదన్నారు. సినిమా షూటింగ్‌లకు అనువైన పర్యాటక స్థానాలకు తెలంగాణ పెట్టింది పేరని, దాంతో 90శాతం సినిమా ఇక్కడ చేస్తే రాయితీతో పాటు సినిమాలకు అవార్డులు ఇవ్వాలన్నారు.
దాంతో పర్యాటకరంగం మరింత వృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలకు తప్పనిసరిగా అవార్డులు ఇవ్వాలని సూచించారు. టీఎఫ్‌సీసీ నంది అవార్డులను 2021-22 సంవత్సరానికి ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ పేర్కొన్నారు.
దుబాయి ప్రిన్స్ చేతుల మీదుగా అవార్డులు ఇస్తామని, 2021-22 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాలు అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. త్వరలోనే దుబాయి ప్రిన్స్ అపాయింట్‌మెంట్ తీసుకొని.. అవార్డుల పంపిణీ తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామన్నారు.