Site icon vidhaatha

మ‌రో సంచ‌ల‌న విజ‌యం న‌మోదు.. ద‌క్షిణాఫ్రికాని చిత్తు చేసిన నెద‌ర్లాండ్స్

చిన్న టీమ్స్‌నే క‌దా అని త‌క్కువ‌గా అంచ‌నా వేశారో త‌గిన మూల్యం చెల్లించుకోవ‌ల్సి వ‌స్తుంద‌ని ఆఫ్ఘ‌నిస్తాన్, నెదర్లాండ్స్ కూల్ వార్నింగ్ ఇచ్చాయి. రీసెంట్‌గా ఆఫ్ఘ‌నిస్తాన్, ఇంగ్లండ్ మ్యాచ్ జ‌ర‌గ‌గా ఆ మ్యాచ్‌లో ఆప్ఘ‌న్ ఘ‌న విజ‌యం సాధించింది. ఇక నిన్న సౌతాఫ్రికా, నెద‌ర్లాండ్స్ మ‌ధ్య జ‌రిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌.. ద‌క్షిణాఫ్రికాపై సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసింది.

ధర్మశాల వేదికగా జరిగిన వరల్డ్ కప్ మ్యాచులో వర్షం కారణంగా ఈ మ్యాచ్ కాస్త ఆలస్యంగా జరిగింది. వర్షం వ‌ల‌న స‌మ‌యం కాస్త వృధా కావ‌డంతో మ్యాచును 43 ఓవర్లకు కుదించారు. మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ద‌క్షిణాఫ్రికా ..నెద‌ర్లాండ్స్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది.


సఫారి బౌల‌ర్స్ ధాటికి నెద‌ర్లాండ్స్ మొద‌ట్లో త‌డ‌బ‌డింది. 82 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా, ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) అనవసర షాట్లకు పోకుండా అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చివ‌ర‌లో బ్యాటింగ్‌కి వచ్చిన ఆర్యన్ దత్ 9 బంతుల్లో 3 సిక్సర్లతో 23 పరుగులు చేయ‌గా, సౌతాఫ్రికా బౌలర్లు ఏకంగా 31 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో అద‌నంగా ఇచ్చింది.

దీంతో నెద‌ర్లాండ్స్ 43 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 245 ప‌రుగులు చేసింది. ఇక ల‌క్ష్య చేధ‌న‌లో భాగంగా స‌పారీ బ్యాట్స్‌మెట్స్‌మెన్స్ మొద‌ట్లో బాగానే ఆడారు. 7.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసిన ఈ జ‌ట్టుకి డికాక్ రూపంలో తొలి వికెట్ పడింది. 22 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్‌ని అకీర్‌మన్ అవుట్ చేయడంతో ఇక మ్యాచ్ మొత్తం నెద‌ర్లాండ్స్ వైపు ట‌ర్న్ అయింది.


31 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ భవుమా ఆ త‌ర్వాత ఔట్ కాగా, ఆ త‌ర్వాతి ఓవ‌ర్లోనే మార్క్‌రమ్, ఆ వెనక వాన్ దేర్ దుస్సేన్ వెంటవెంటనే ఔట్ అయ్యారు. దీంతో సౌతాఫ్రికా జ‌ట్టు 44 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. డేవిడ్ మిల్లర్, హెన్రీచ్ క్లాసిన్ కలిసి ఐదో వికెట్‌కి 45 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ని ముందుకు న‌డిపిస్తున్నార‌నుకున్న స‌మ‌యంలో 28 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసిన హెన్రీచ్ క్లాసిన్, విక్రమ్‌జీత్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవీలియ‌న్ బాట ప‌ట్టాడు.

ఇక 9 పరుగులు చేసిన మార్కో జాన్సెన్‌.. వాన్ మికీరన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంత‌రం 52 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసిన మిల్ల‌ర్ వాన్ బ్రీక్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. గెరాల్డ్ కోట్జీ‌న, కగిసో రబాడా , కేశవ్ మహరాజ్ ల‌ని కూడా నెద‌ర్లాండ్స్ బౌల‌ర్స్ త్వ‌ర‌గానే ఔట్ చేశారు. దీంతో 42.5 ఓవర్లలో సౌతాఫ్రికా 207 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్ర‌మంలో ప‌సికూన నెద‌ర్లాండ్స్ 38 పరుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

Exit mobile version