BalaKrishna:
జీవితంలో ఒక్కసారి జరిగే పెళ్లి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లుతో పాటు కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా జరుపుకుంటాము. ఇక సెలబ్రిటీల పెళ్లిళ్ల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆకాశమంత పందిరి భూదేవి అంతపీట వేసి అంగరంగ వైభవంగా జరుగుతుంది. పెళ్లికి అటోళ్లు, ఇటోళ్లే కాకుండా సన్నిహితులు, స్నేహితులు కూడా హాజరవుతుంటారు.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో నందమూరి వంశానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అన్నగారు నందమూరి తారకరామారావు నిస్వార్ధ రాజకీయాలతో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. నటుడిగా కూడా ఆయన విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు.
సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ ఎవరి సపోర్ట్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగారు. ఒక స్టార్ హీరోగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలకి చాలా దగ్గరయ్యారు. కాగా, ఎన్టీఆర్, బసవతారంకం దంపతులకు 12 మంది సంతానం.
వారిలో ఎనిమిది మంది కొడుకులు, నలుగురు కూతుర్లు ఉన్నారు.అందరి పెళ్లిళ్లు ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్.. బాలకృష్ణ, రామకృష్ణ వివాహానికి మాత్రం హాజరు కాలేదట. వీరిద్దరి వివాహాలు ఒకే రోజు జరిగినప్పటికీ కూడా నందమూరి తారకరామారావు వెళ్లలేకపోయారు.
అందుకు కారణం అప్పుడు ఎన్టీఆర్ ప్రజా యాత్రలో బిజీగా ఉండడం. బాలకృష్ణ, రామకృష్ణల వివాహం తిరుపతిలో ఘనంగా జరిగింది. అయితే అప్పుడు ఎన్టీఆర్ ప్రజా యాత్ర చేస్తూ… ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఉన్నారు. రాష్ట్రమంతా ఎలక్షన్ల సందడి నెలకొని ఉండడం వల్ల ఎన్టీఆర్ ప్రజా యాత్ర చేస్తూ చాలా బిజీగా ఉన్నారు.
ఆ కారణం వల్లనే సొంత కుమారుల వివాహానికి కూడా ఎన్టీఆర్ వెళ్లలేక పోయారు. వివాహం కోసం యాత్రకి బ్రేక్ ఇవ్వకూడదని భావించిన అన్నగారు పెళ్లికి వెళ్లకుండానే యాత్రని కొనసాగించారట. అయితే పెళ్లయ్యాక బాలకృష్ణ, రామకృష్ణ దంపతులు యాత్రలో ఉన్న ఎన్టీఆర్ వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారని సమాచారం. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలో మురళీమోహన్ తెలియజేయడం జరిగింది.