Site icon vidhaatha

Pervez Musharraf | పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ కన్నుమూత

Pervez Musharraf | పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయిలోని ఓ దవాఖానాలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడం తుదిశ్వాస విడిచారని పాక్‌ మీడియా వెల్లడించింది. ముషారఫ్‌ 1943, ఆగస్ట్‌ 11న భారత్‌లోని ఢిల్లీలో జన్మించారు. అయితే, 1947 దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పాక్‌కు వెళ్లింది. అతని తండ్రి విదేశీ మంత్రిత్వశాఖలో పని చేసేవారు. కరాచీలోని సెయింట్‌ పాట్రిక్స్ హైస్కూల్‌లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు.

లాహోర్‌లోని ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజీలో ముషారఫ్‌ ఉన్నత విద్యనభ్యసించారు. 18సంవత్సరాల వయసులో 1964లో పాక్‌ సైన్యంలో చేరారు. క్వెట్టాలోని ఆర్మీ స్టాఫ్ అండ్ కమాండ్ కళాశాలలో గ్రాడ్యుయేట్ అయ్యారు. అంచలంచలుగా ఎదిగి పాక్‌ సైనికదళాల ప్రధాన అధికారి వరకు ఎదిగారు. 1999లో అప్పటి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సర్కార్‌పై తిరుబాటు చేసి ప్రభుత్వ పగ్గాలను హస్తగతం చేసుకున్నారు. రెండేండ్ల తర్వాత పాక్‌ 10వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2001 నుంచి 2008 వరకు దేశాధ్యక్షుడిగా పని చేసిన ముషారఫ్‌ అభిశంసను తప్పించుకునేందుకు తన పదవికి రాజీనామా చేశారు. 2014 మార్చి 31న దేశద్రోహం కేసులో ముషారఫ్‌ను ఇస్లామాబాద్‌ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది.

దేశద్రోహం నేరం కింద మరణశిక్ష విధించింది. 2020లో, లాహోర్ హైకోర్టు మరణశిక్షను రద్దు చేసింది. గతంలో చేపట్టిన విచారణ విచారణ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ప్రాణభయంతో ముషారఫ్‌ దుబాయికి పారిపోయారు. 2016 నుంచి అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధానికి ముషార‌ఫ్‌ ప్రధాన కారకుడు. ముషారఫ్‌ గతకొంతకాలంగా అమిలోయిడోసిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కణజాలాలు, అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అమిలాయిడ్ అని పిలువబడే ఒక అసాధారణ ప్రోటీన్ నిర్మాణం వల్ల సంభవించే అరుదైన వ్యాధి ఇది.

Exit mobile version