Patas Yadamma Raju | పటాస్ కమెడియన్ యాదమ రాజు, షార్లీ స్టెల్లా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వీరిద్దరూ గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని పలు వేదికలపై వెల్లడించారు. మొత్తానికి ఇరు కుటుంబాలను ఒప్పించి, ఒక్కటయ్యారు. యాదమ రాజు, స్టెల్లా నిశ్చితార్థ వేడుకను కుటుంబ సభ్యులు దగ్గరుండి జరిపించారు. ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు హాజరై, ఆ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
యాదమ రాజు పటాస్ షోకు హాజరై పాపులరైన సంగతి తెలిసిందే. అక్కడ్నుంచి తన కెరీర్ మలుపు తిరిగింది. టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు యాదమ రాజు. ఇక తన ప్రేయసిని రెండేండ్ల క్రితం తన అభిమానులకు పరిచయం చేశాడు. 2020 ఆగష్టు 22న జీతెలుగులో ‘బాపు బొమ్మకు పెళ్లంట’ అనే వినోద కార్యక్రమంలో స్టెల్లాను పరిచయం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు యాదమ రాజు.
తన ప్రేయసి అసలు పేరు షార్లీ స్టెల్లా అని.. ఆమె వయసు 22 అని వెల్లడించాడు యాదమ రాజు. తన ఫ్రెండ్ ద్వారా వాళ్ల ఫ్రెండ్ స్టెల్లా అని.. మొదట ఫ్రెండ్‌గా పరిచయం అయ్యి ఆ తరవాత లవర్‌గా మారిందని చెప్పాడు. అయితే యాదమ రాజుపై ఉన్న ప్రేమతో అతని పేరుని చేతిపై రాయించుకుంది స్టెల్లా. దాన్ని కూడా ‘బాపు బొమ్మకు పెళ్లంట’ కార్యక్రమంలో యాదమ రాజుకి చూపించి సర్ ప్రైజ్ చేసింది స్టెల్లా. అప్పటి నుంచి వీరి ప్రేమ ప్రయాణం సాగుతూ.. ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటికాబోతున్నారు.