యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ఆదిపురుష్ చిత్రంతో పలకరించిన ప్రభాస్ త్వరలో వరుస సినిమాలతో పలకరించబోతున్నాడు. ప్రభాస్ నటించిన సలార్ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల చేస్తామని ముందుగా ప్రకటించారు. కాని ఈ చిత్రం అనివార్య కారణాల వలన వాయిదా పడింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి ఏడీ 2898 మూవీ 2024 సంక్రాంతికి లేదా.. వేసవి సెలవుల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ప్రభాస్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో స్పిరిట్, రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్), పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‍తో ఓ మూవీ ఉన్నాయి.ఈ సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకులని ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేయబోతున్నట్టు సమాచారం.
అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కొద్ది రోజులుగా మోకాలి గాయంతో చాలా బాధపడుతున్నాడు. పలు మూవీ షూటింగ్స్‌తో పాటు ఈవెంట్స్‌లోను ఆయన ఇబ్బందిగా కనిపించారు. అయితే మోకాలి గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రభాస్ శస్త్ర చికిత్స కోసం ఇటీవల యూరప్ వెళ్లారు. అక్కడ ఆయన సర్జరీ చేయించుకోగా, అది సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. అయితే మోకాలి సర్జరీ కారణంగా ప్రభాస్ నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. అయితే మోకాలి నొప్పి తగ్గే వరకు ప్రభాస్ యూరప్‌లోనే ఉండనున్నారట. అక్టోబర్ చివరి వారంలో ఆయన తిరిగి హైదరాబాద్‌కి రానుండగా, నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి తిరిగి షూటింగ్స్ లలో ప్రభాస్ పాల్గొంటాడని సమాచారం.
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో నెలల తరబడి యాక్షన్ సీన్స్ చేయడం వల్లనే ప్రభాస్‌కి మోకాలి నొప్పి వచ్చిందని అంటున్నారు. మధ్య మధ్యలో టెంపరరీ ట్రీట్‌మెంట్ తీసుకున్నా కూడా ఆ నొప్పి తగ్గకపోవడంతో ఆయన సర్జరీకి వెళ్లాడు. మోకాలి నొప్పితోనే ప్రభాస్ ఆదిపురుష్, సలార్ చిత్ర షూటింగ్స్ చేసిన విషయం విదితమే. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశపరుస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన నుండి మంచి హిట్ ఒకటి రావాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు.