Prithvi Shaw | భారత స్టార్ క్రికెటర్ పృథ్వీ షా వివాదాల్లో చిక్కుకున్నాడు. బుధవారం ముంబయిలో షా కారుపై దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెల్ఫీలకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురై కారుపై దాడి చేశారు. ఈ కేసులో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా గురువారం ఈ కేసులో మరికొరిని అదుపులోకి తీసుకున్నారు.
సోషల్ మీడియాలో ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పృథ్వీ షా, ఓ మహిళా అభిమాని మధ్య గొడవ జరుగుతున్నట్లు కనిపించింది. ఇద్దరు బేస్ బాల్ బ్యాట్ పట్టుకొని కనిపించారు. అసలు ఏం జరిగిందో ఓ సారి తెలుసుకుందాం..!
హోటల్ లోపల ఏం జరిగింది..?
భారత స్టార్ ఓపెనర్ బుధవారం రాత్రి భోజనం చేసేందుకు ఫైవ్ స్టార్ హోటల్‌కి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఓ వ్యక్తి అతని వద్దకు వచ్చి సెల్ఫీ దిగాలని కోరాడు. అభిమానిని నిరాశ పరుచకుండా ఫొటోకి ఫోజులిచ్చాడు. కొద్దిసేపటి తర్వాత తన స్నేహితులతో కలిసి అక్కడికి చేరుకొని సెల్ఫీ కోసం డిమాండ్ చేశారు. నేను స్నేహితులతో కలిసి డిన్నర్ చేసేందుకు వచ్చానని చెబుతూ తిరస్కరించాడు.
కానీ, వారంతా సెల్ఫీ కోసం పట్టుబట్టడంతో పృథ్వీ స్నేహితుడు హోటల్ మేనేజర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. మేనేజర్ వారిని హోటల్ నుంచి బయటకు పంపించి వేశారు. అయితే, భోజనం ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత మరోసారి వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత బేస్‌బాల్ బ్యాట్లతో షా కారుపై దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో క్రికెటర్ కారులోనే ఉన్నాడు. ఆ తర్వాత అతని స్నేహితుడు షాను తన కారులో అక్కడి నుంచి పంపించి వేశాడు.
Prithvi Shaw | చిక్కుల్లో స్టార్ క్రికెటర్ పృథ్వీ షా..! మహిళా అభిమానితో గొడవ..! అసలు ఏం జరిగిందంటే..? | https://t.co/b2CMoUBoul #BCCI #PRUDHVISHA #CRICKET pic.twitter.com/dvklTRMDwW
— vidhaathanews (@vidhaathanews) February 17, 2023
రూ.50వేలు డిమాండ్ చేసిన సోషల్ మీడియా స్టార్..?
స్నేహితుడి కారులో వెళ్తున్న క్రికెటర్‌ను యువకులు వెంబడించారు. అనంతరం ఆ కారుపై సైతం దాడి చేయడంతో అద్దాలు పగిలిపోయాయి. అక్కడకు వచ్చిన ఓ యువతి రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేకపోతే తప్పుడు కేసు పెడుతామని బెదిరింపులకు పాల్పడినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే, క్రికెటర్‌తో పాటు అతని స్నేహితులు తమపైనే దాడి చేసినట్లు ఆరోపించారు.
ఈ ఘటన తర్వాత పృథ్వీ షా స్నేహితుడు ఓషివారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ ఘటనలో పోలీసులు ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ఇద్దరిని శోభిత్ ఠాకూర్, సనా అలియాస్ సప్నా గిల్‌గా గుర్తించారు. సప్నా గిల్ సోషల్ మీడియా స్టార్ కావడం గమనార్హం. మరో ఆరుగురి వివరాలు తెలియరాలేదు. వీరిపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పలువురిని అరెస్టు చేశారు.
ఆరోపణలను ఖండించిన సప్నా గిల్
అయితే, తనపై వచ్చిన ఆరోపణలను సప్నా గిల్ కొట్టిపారేసింది. పృథ్వీ షా దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. ఈ కేసులో సప్నా గిల్ తరఫు న్యాయవాది అలీ కాషిప్ ఖాన్ మాట్లాడారు. సప్నా పృథ్వీ షాపై పోరాటం చేసిందన్నారు. ఇదిలా ఉండగా.. గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇందులో సప్నాతో పాటు పృథ్వీ షా, అతని స్నేహితులు తమపై దాడి చేసినట్లుగా ఆరోపించారు. పృథ్వీకి సంబంధించిన వీడియో తన వద్ద ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో పృథ్వీ మహిళా అభిమానితో తలపడడం, ఇద్దరు బేస్‌బాల్ బ్యాట్లను పట్టుకోవడం గమనార్హం. అయితే తన క్లయింట్ సప్నాను పోలీసులు ఓషివారా పోలీస్‌స్టేషన్‌లో ఉంచారని, వైద్యానికి వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని లాయర్ తెలిపారు.
537 రోజుల తర్వాత టీమిండియాలోకి..
పృథ్వీ షా 537 రోజుల తర్వాత ఇటీవలే టీమ్ ఇండియాకు తిరిగి ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కినా.. బరిలోకి దిగే అవకాశం రాలేదు. పృథ్వీ చివరిసారిగా 25 జూలై 2021న శ్రీలంకపై భారత్ తరఫున ఆడాడు. 2018 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన టీమ్ ఇండియాకు పృథ్వీ కెప్టెన్ కావడం విశేషం. పృథ్వీ భారత్ తరఫున ఐదు టెస్టులు ఆడి, 42.37 సగటుతో 339 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
అరంగేట్రం టెస్టులోనే సెంచరీ చేసిన రికార్డు పృథ్వీ పేరిట ఉన్నది. అంతేకాకుండా ఆరు వన్డేల్లో 31.50 సగటుతో 189 పరుగులు చేశాడు. అదే సమయంలో, భారతదేశం తరఫున ఇప్పటి వరకు కేవలం ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. అందులోనే పరుగులేమీ చేయలేకపోయాడు. దేశవాళీ క్రికెట్‌లో పృథ్వీ 41 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 51.75 సగటుతో 3,623 పరుగులు చేశాడు. వీటిలో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.