Ratha Sapthami | సూర్యుడి గమనం ఏడు గుర్రాలు కట్టి ఉన్న బంగారు రథంపై సాగుతుందని వేదాల్లో ఉంది. భానుడి గమనం ప్రకారం ఉత్తరాయణం, దక్షిణాయణం అని రెండు విధాలు ఉంటుంది. ఆషాఢ మాసం నుంచి పుష్యమాసం దాకా దక్షిణాయణం కాగా ఈ ఆయనంలో సూర్యుడి రథం దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభ సూచకంగా రథసప్తమిని భావిస్తారు. మాఘమాసం శుక్ల సప్తమి (శుద్ధ సప్తమి)రోజు వచ్చే పండుగ రథ సప్తమి.
హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. ఈ సారి ఫిబ్రవరి 16న ఈ పండుగ నిర్వహించుకోనున్నారు. మాఘ శుక్ల సప్తమి నాడు సూర్యభగవానుడు తన ఏడు గుర్రాల రథం, రథసారథి అరుణతో ప్రత్యక్షమై మొత్తం సృష్టిని ప్రకాశవంతం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. సూర్య భగవానుడు ఈ రోజే జన్మించాడని, అందుకే రథ సప్తమి రోజున సూర్యున్ని ఆరాధిస్తే సంతోషం, ఐశ్వర్యం, సంపదలు దరిచేరుతాయని భావిస్తారు. మరి ఈ పండుగ రోజు ఏ పనులు చేస్తే మంచిదో ఒకసారి చూద్దాం..
నదీస్నానం పుణ్యఫలం
రథసప్తమి రోజున సూర్యోదయ సమయంలో నదీ స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. వెళ్లే వీలు లేనివారు ఇంటి వద్దే ప్రత్యేకంగా స్నాన ఏర్పాట్లు చేసుకోవాలి. తలపై ఏడు జిల్లేడు ఆకులు, ఏడు రేగు ఆకులు పెట్టుకొని.. వాటి మీద నుంచి నీరు పడుతూ.. శరీరం మొత్తం తడిసేలా స్నానం చేయాలి. సూర్యుడిని ఆరాధిస్తూ శ్లోకాలను చదివి.. ఆ తర్వాత సప్తమి స్నానం చేస్తే శుభాలు కలుగుతాయని పేర్కొంటున్నారు.
ఎరుపు రంగు దుస్తులు ధరించాలి
రథ సప్తమి రోజున సూర్యునికి ప్రీతికరమైన పనులు చేయాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఈ సీజన్‌లో విరివిగా దొరికే చిక్కుడు కాయలతో చేసిన రథంలో సూర్యుడి ప్రతిమ, లేదా ఫొటో పెట్టాలి. లేదంటే చిక్కుడు ఆకుపై రక్తచందనంతో సూర్యుడి బొమ్మవేయాలి. దానిని రథంలో ఉంచి పూజించాలి. రథసప్తమి సందర్భంగా ప్రకృతిలో కొన్ని ధాతువులు చైతన్యవంతమవుతాయని, అందుకే ఈ రోజు పూర్తిగా ప్రకృతితో మమేకమై సూర్యుడి పూజలో ఉంటే మనకు ఆ శక్తి అందుతుందని పండితులు చెబుతున్నారు.
పాయసం ప్రత్యేకం..
ఆవు పాలు, కొత్త బియ్యం, బెల్లం, నెయ్యితో చేసిన చేసిన పాయసాన్ని సూర్య భగవానుడికి నివేదించాలి. ఇంట్లో తులసికోట వద్ద రాళ్ల పొయ్యి ఏర్పాటు చేసి ఆవు పిడకలను మండించి నైవేద్యం వండితే మరింత శ్రేష్టం. మాఘ మాసంలో ప్రతి ఆదివారం ఉదయం ఇలా సూర్యుడికి నైవేద్యం వండి పెడితే తాను ప్రీతి చెంది సకల శుభాలను కలిగిస్తాడని నమ్మకం.
దానం.. ఫలితం
రథసప్తమి రోజు దానం చేయాలి. ఏ చిన్న దానం చేసినా పుణ్యఫలం లభిస్తుంది. దుస్తులు గాని, డబ్బు గాని, ఆహారం గాని దానం చేయాలి. ఏదైనా నోము ప్రారంభించుకోవాలంటే అందుకు రథసప్తమి శుభ సమయమని చెబుతుంటారు. ఈ రోజున ఏ నోము పట్టుకున్నా అద్భుతమైన ఫలితం ఉంటుందని నమ్ముతారు.
చేయకూడని పనులు
శాస్ర్తాల ప్రకారం.. ఆదివారం మాంసం తినకూడదు. మద్యం ముట్టకూడదు. శృంగారంలో పాల్గొనకూడదు. తైలానికి సంబంధించినవి ఏవీ తినకూడదు. క్షవరం చేయించుకోవద్దు. ముఖ్యంగా మాఘమాసంలోని ఆదివారాల్లో వీటిని తప్పక పాటిస్తే మీకు సూర్యుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.