Ind vs Wi |
ప్రస్తుతం ఇండియా, వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. డొమినికా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రోజు అశ్విన్, యశస్వి మెరుపులే కాకుండా సిరాజ్, గిల్ హైలైట్స్ కూడా ఉన్నాయి. మహ్మద్ సిరాజ్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకోగా, శుభ్‌మన్ గిల్ అదిరిపోయే స్టెప్పులతో వీక్షకులని ఆకట్టుకున్నాడు. మొత్తానికి విండీస్ గడ్డపై తొలి రోజు టీమిండియా ఆధిపత్యం కనిపించింది.
అశ్విన్, జడేజా దెబ్బకు వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. బదులుగా భారత జట్టు ఓపెనర్లు రెచ్చి పోయి ఆడారు. ఈ మ్యాచ్‌తో టెస్ట్ అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ (40 నాటౌట్) అద్భుతంగా ఆడాడు. అతనికి కెప్టెన్ రోహిత్ శర్మ (30 నాటౌట్) మంచి సహకారం అందించాడు.
ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే తొలి టెస్టులో భారత జట్టు ఘనవిజయం సాధించడం పక్కాగా కనిపిస్తోంది. బౌలర్లకు మంచి సహకారం లభించే విండ్‌సోర్ పార్క్‌లో భారత బ్యాటర్లు ఈ రేంజ్‌లో చెలరేగడం చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే టీమిండియా భారీ స్కోరు చేయడం గ్యారంటీ అని అంటున్నారు.
అయితే ఈ మ్యాచ్ హైలైట్స్ చూస్తే.. జడ్డూ వేసిన 28వ ఓవర్ చివరి బంతికి విండీస్ బ్యాటర్ బ్లాక్‌వుడ్ మిడాఫ్ మీదుగా బౌండరీ బాదే ప్రయత్నం చేయగా, మిడాఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్.. వెనక్కి పరుగెత్తుతూ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ అందుకొని అందరికి షాక్ ఇచ్చాడు.
ఇక టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో డ్యాన్స్ చేయడం కూడా హైలైట్ గా నిలిచింది. విండీస్ 148 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన దశలో 63 ఓవర్లు ముగిసిన తర్వాత ఫార్వర్డ్ షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్‌మన్ గిల్.. ఒక్కసారిగా హ్యాపీ మూడ్‌లోకి వచ్చి చిందులేశాడు.
అతని డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇక ఈ మ్యాచ్‌లో అశ్విన్ మరోసారి తన స్పిన్ మ్యాజిక్‌తో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీయడం ఇది అశ్విన్‌కి 33వ సారి.