భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐఫోన్ చోరీకి గురైందట. ఆస్ట్రేలియాతో మూడో వన్డేకి ముందు ప్రాక్టీస్ సెషన్ ముగిసాక తన ఫోన్ లేదనే విషయాన్ని గమనించాడు రోహిత్. ఎక్కడ వెదికిన కూడా కనిపించకపోవడంతో వెంటనే పోలీసులతో పాటు స్థానిక అధికారులు, సౌరాష్ట్ర క్రికెట్ సంఘం ఆ ఫోన్‌ను వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దానిని ఎవరో దొంగిలించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రోహిత్ శర్మకి తన వస్తువులు మరచిపోయే అలవాటు ఉంటుంది. ఇలానే తన మొబైల్ ఏమన్నా మరచిపోయి ఉంటాడేమో అని మరి కొందరు అంటున్నారు.
సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, ఇండియా మూడో వన్డే జరగగా, ఈ మ్యాచ్ కు ముందు నెట్స్‌లో రోహిత్ ప్రాక్టీస్ చేశాడు. ఆ సమయంలోనే రోహిత్ మొబైల్ పోయిందట. అయితే ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోని రోహిత్.. ఆసీస్‌పై తనదైన స్టైల్‌లో బ్యాటింగ్ చేసి 81 పరుగులు చేశాడు. తొలి రెండు వన్డేలకి విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ మూడో వన్డేలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కాని మ్యాక్స్‌వెల్ సూపర్భ్ క్యాచ్‌తో సెంచరీ చేయకుండానే పెవీలియన్ బాట పట్టాల్సి వచ్చింది. సరిగ్గా వరల్డ్ కప్ ముందు రోహిత్ మళ్లీ ఫామ్‌లోకి రావడంతో ఇక ప్రతిష్టాత్మక మ్యాచ్‌లలో హిట్ మ్యాన్ బ్యాటింగ్ పీక్స్ చేరుతోందని ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు.
ఇదిలా ఉంటే రోహిత్ శర్మ కొద్ది రోజుల క్రితం ఆసియా కప్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ దక్కించుకున్న రోహిత్ బృందం కొలంబో నుంచి ముంబై బయలుదేరింది. ఆ సమయంలో రోహిత్ తన పాస్‌పోర్టును హోటల్‌లో మర్చిపోయాడు. బస్సులో ఎక్కిన తర్వాత రోహిత్ కి ఈ విషయం గుర్తుకు రావడంతో వెంటనే తన సపోర్ట్ స్టాఫ్ మెంబర్స్ వెంటనే హోటల్‌కు వెళ్లి రోహిత్ పాస్‌పోర్టును తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఇలా రోహిత్ శర్మ చాలా సందర్భాలలో చాలా వస్తువులు మరచిపోయాడని, ఆయన సన్నిహితులు చెబుతుంటారు. మరి ఫోన్ కూడా అలానే మరచిపోయాడా, లేక పోయిందా అనేది తెలియాల్సి ఉంది.