Superbugs | విధాత: బ్యాక్టీరియా (Bacteria) అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది జబ్బులు, ఇన్ఫెక్షన్‌లు. ఒక రకంగా ఇది నిజమే కూడా. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ బ్యాక్టీరియా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని బ్యాక్టీరియాలు మందులకు లొంగుతుండగా… మరికొన్నింటికి మందులు కూడా ఉండవు. ఇలా యాంటీబయాటిక్స్‌కు కూడా లొంగని వాటిని సూపర్‌బగ్స్ అని పిలుస్తారు. అలాంటి శక్తిమంతమైన వాటిని చంపే జీవులు కూడా ఉంటాయని ఆలోచించడం కూడా కష్టమే కానీ.. శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి అలాంటి ఒక వైరస్‌ను కనుగొన్నారు.
బ్యాక్టీరియాఫేజెస్ అనే ఒక రకమైన సమూహానికి చెందిన బ్యాక్టీరియా ఈ సూపర్‌బగ్స్ (Superbugs) ను నిలువరించగలవని స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఈటీహెచ్ జ్యురిచ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి సూపర్‌బగ్స్‌ను చంపడమే కాకుండా.. భవిష్యత్తుల అవసరాలకు తమ సంఖ్యను వృద్ధి కూడా చేసుకుంటాయి. యాంటీబయాటిక్స్‌కు లొంగని.. లేదా రోగ నిరోధక శక్తిని ఇనుమడించుకున్న బ్యాక్టీరియాను సైతం ఇవి నాశనం చేయగలవని వారు పేర్కొంటున్నారు. మనలోకి ప్రవేశించిన బ్యాక్టీరియాకు ఒక వేళ కావాల్సిన పోషకాలు లభించకపోతే.. అవి నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోతాయి.
అవి చూడటానికి అచేతనంగా ఉన్నప్పటికీ.. యాంటీబయాటిక్స్‌కు గానీ బ్యాక్టీరియాఫేజెస్‌కు గానీ లొంగకుండా ఉండేటా రక్షణవ్యవస్థను అభివృద్ధి చేసుకుంటాయి. అందుకే ఇప్పటి వరకూ ఇలా నిద్రాణ స్థితిలో ఉన్న బ్యాక్టీరియాను బ్యాక్టిరియాఫేజెస్‌ను ఉపయోగించి నిర్మూలించడం సాధ్యం కాలేదు, కానీ తొలిసారిగా ఈటీహెచ్ పరిశోధకులు ఆ దిశగా గొప్ప విజయం సాధించారు. దీని కోసం వారు పరేడ్ అనే ఒక బ్యాక్టీరియోఫేజ్‌ను కనుగొన్నారు. స్విట్జర్లాండ్‌లోని ఒక శ్మశానంలో కుళ్లిపోయిన మొక్క నుంచి ఈ బ్యాక్టీరియాను సేకరించడం విశేషం.
దీనిని సేకరించిన ప్రదేశం కాస్త జుగుప్స కలిగించేదే అయినప్పటికీ ఇది మానవాళికి ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. పరిశోధనల్లో భాగంగా ఈ బ్యాక్టీరియాను ప్రాణాంతక నిమోనియాను కలిగించే సుడోమోనస్ అరెజినోసాపై ప్రయోగించగా.. పరేడ్ దానిని అంతం 99 శాతం నిర్మూలించింది. యాంటీబయాటిక్ మెరోపనేమ్‌తో కలిపి పరేడ్‌ను ఆ ప్రాణాంతక బ్యాక్టీరియాపై ప్రయోగించామని.. సానుకూల ఫలితాలు వచ్చాయని పరిశోధనకు నేతృత్వం వహించిన మైక్రోబయాలజిస్ట్ అలెగ్జాండర్ హార్మ్స్ వెల్లడించారు. ఎలుకలపై ప్రయోగాలు విజయవంతమయ్యాయని.. మనుషులపై క్లినికల్ పరీక్షలు జరపాల్సి ఉందని ఆయన తెలిపారు.