Site icon vidhaatha

ఆ.. నగరంలో ‘కులం’ నిషేధం.. తీర్మానం ఆమోదం

విధాత: కులము.. కులము.. అని భారతదేశంలో ఇంకా కుమ్ములాటలు జరుగుతుంటే.. అమెరికాలోని సియాటిల్‌ సిటీ (Seattle City Council) మాత్రం ఆ దేశంలోనే కుల వివక్షను నిషేధించిన (banned caste discrimination) మొట్టమొదటి నగరంగా నిలిచింది. వివక్ష చట్టాల్లో కుల వివక్షను కూడా చేర్చింది. ఈ తీర్మానాన్ని సిటీ కౌన్సిలర్‌ క్షమా సావంత్‌ (Kshama Sawant) ప్రవేశపెట్టారు.

సిటీ కౌన్సిలర్లలో ఆమె ఏకైక ఇండియన్‌-అమెరికన్‌. ఈ తీర్మానాన్ని సావంత్‌ జనవరిలోనే ప్రతిపాదించారు. ఉద్యోగాలు, విద్య, నివాసాలు వంటి విషయాల్లో దక్షిణాసియా అమెరికన్లు తీవ్ర వివక్ష ఎదుర్కొంటున్నారని, గత కొద్ది వారాల్లోనే వందలకొద్దీ దీనమైన కథలు విన్నామని క్షమా సావంత్‌ తెలిపారు.

సియాటిల్‌లో కుల వివక్ష కచ్చితంగా ఉన్నదనేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. జాత్యహంకారం ఏ విధంగా వివక్షో.. కుల వివక్ష కూడా అలాంటిదేనని చెప్పారు. అయితే.. అమెరికాలోని హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌, కొయిలేషన్‌ ఆఫ్‌ హిందూస్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా వంటి సంస్థలు మాత్రం ఆమె చర్యను వ్యతిరేకించాయి. ఇప్పటికే దేశంలో వివక్షను ఎదుర్కొంటున్న కమ్యూనిటీని అనవసరంగా బయటపెట్టడమే అవుతుందని వాదించాయి.

కానీ.. ఈ వాదనను క్షమాసావంత్‌ గట్టిగా తిప్పికొట్టారు. కుల వివక్ష దేశ, మత హద్దులను ఎలా దాటుతున్న దనేందుకు ఈ తీర్మానం నిదర్శనమని చెప్పారు. అమెరికాలో ఇటువంటి తీర్మానం ఆమోదం పొందటం చారిత్రాత్మకమని అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ అభివర్ణించింది. అమెరికాలో అణచివేతకు గురవుతున్న కమ్యూనిటీలకు భవిష్యత్తులో ఇది ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నది.

Exit mobile version