ఇటీవల అంబానీ ఇంట పెళ్లిసందడి మొదలైందని అందరికీ తెలుసు. ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం, రాధికామర్చంట్‌తో త్వరలో జరుగనుంది. మొన్నీమధ్యనే అట్టహాసంగా ప్రివెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. బాలీవుడ్ మొత్తం కదిలిరాగా, దక్షిణాది నుండి రజనీకాంత్, రామ్‌చరణ్ మాత్రమే హాజరయ్యారు.
ఇక వివాదం ఎక్కడ మొదలైందంటే, ఖాన్ త్రయం, షారుఖ్, సల్మాన్, ఆమిర్ ముగ్గురు స్టేజీ ఎక్కి నాటు నాటు పాటకు డాన్స్ స్టార్ట్ చేసారు. ఆ స్టెప్స్ క్లిష్టంగా ఉండటంతో ఆ పాటలో అద్భుతంగా డాన్స్ చేసిన రామ్‌చరణ్‌ను షారుఖ్ స్టేజి పైకి పిలిచాడు. ఆ పిలవడం, ఏయ్..ఇడ్లీవడా రామ్‌చరణ్.. కమ్ అనడంతో రచ్చ మొదలైంది. ఏమాత్రం గౌరవం లేకుండా అలా పిలవడంపై రామ్‌చరణ్ సతీమణి ఉపాసన మేకప్ విమన్ జేబాహసన్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. దాంతో ఈ సంఘటన విపరీతంగా వైరల్ అయిపోయింది.
రామ్‌చరణ్ అభిమానులు కోపగించుకుని షారుఖ్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టడం మొదలుపెట్టారు. మేం కూడా పావ్‌బాజీ, వడాపావ్ అని పిలుస్తామని… అసలు మామూలుగానే దక్షిణాది నటులంటే షారుఖ్‌కు మొదటినుంచీ చిన్నచూపనీ, ఈమధ్య రెండు హిట్లు పడగానే రెచ్చిపోతున్నాడని రకరకాలుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదంతా చూస్తున్న షారుఖ్ అభిమానులు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసారు. షారుఖ్ అలాంటివాడుకాదనీ, రామ్‌చరణ్ అంటే అయనకు చాలా ఇష్టమనీ వీరు ఉదాహరణ చెబుతున్నారు. అదేంటంటే 2001లో విడుదలైన షారుఖ్‌ఖాన్ సినిమా వన్ టూ కా ఫోర్ లో తన డైలాగ్ ఒకటుంది.
సౌత్‌లో ఫేమస్ ఏంటంటే, ఇడ్లీ, వడ, రజనీ, నాగ్, వెంకీ అని చెపుతాడు. దాని పోలికతో ఈ రకంగా పిల్చాడని, రజనీకాంత్ ప్లేస్‌లో రామ్‌చరణ్ పేరు పెట్టి పిలవడం గౌరవప్రదమే కదా అనేది వీరి వాదన. సరే.. ఎవరి వాదన ఏదైనా అంతమంది విఐపీల ముందు అలా పిలవడం సభ్యత కాదనేది చాలామంది భావన. అది నిజమే కదా మరి.