Snake Bite | ఓ వ్యక్తి స్మగ్లింగ్ కేసులో జైలు పాలయ్యాడు. ఇదే అదునుగా భావించిన అతని భార్య.. ప్రియుడితో వెళ్లిపోయింది. జైలు నుంచి విడుదలైన భర్త.. రెండో వివాహం చేసుకున్నాడు. కానీ మొదటి భార్య మళ్లీ వస్తానని మొండి చేసింది. ఈ క్రమంలో రెండో భార్యకు పాముతో కాటు వేయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మాల్యా ఖేడీ గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మాల్యా ఖేడీ గ్రామానికి చెందిన మోజిమ్ అజ్మేరీ అనే వ్యక్తి స్మగ్లింగ్ కేసులో జైలు పాలయ్యాడు. 2015లో జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే అతని భార్య షాను బీ తన ప్రియుడితో వెళ్లిపోయిందని తెలిసింది. ఇక తనకు తోడు కావాలని భావించిన అజ్మేరీ.. హలీమా బీ అనే మహిళతో రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం మొదటి భార్య షాను బీకి తెలిసింది. తాను నీ వద్దే జీవితం కొనసాగిస్తానని షాను బీ అజ్మేరిని కోరింది. మొండి చేసింది. ఈ నేపథ్యంలో రెండో భార్యను వదిలించుకోవాలని మోజిమ్ నిర్ణయించుకున్నాడు.
ఇటీవలే స్నేక్ క్యాచర్ రమేశ్ మీనాను మోజిమ్ సంప్రదించాడు. విషయం చెప్పి ఓ పాము విషపూరిత పామును ఇంటికి తీసుకొచ్చాడు. నిద్రిస్తున్న హలీమా బీకి ఆ పాముతో కాటు వేయించాడు. ఆమె స్పృహ కోల్పోయినప్పటికీ, కాసేపటికే మెలకువ వచ్చింది. ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ సారి ఏకంగా పామును ఆమెపై వదిలేశారు. అయినా ఫలితం లేదు. దీంతో విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి మోజిమ్, అతని సోదరుడు, స్నేక్ క్యాచర్ రమేశ్ పరారీ అయ్యారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న హలీమాను ఆమె తండ్రి ఆస్పత్రికి తరలించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మోజిమ్, సోదరుడు కాలా, రమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.