Site icon vidhaatha

Somalia | అంత‌ర్జాతీయ వేదిక‌పై అథ్లెట్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌… క్ష‌మాప‌ణ‌లు చెప్పిన క్రీడ‌ల శాఖ మంత్రి

Somalia

విధాత‌: చైనా (China) లో జ‌రుగుతున్న ప్ర‌పంచ విశ్వ‌విద్యాల‌యాల క్రీడా పోటీల వేడుక‌ల్లో చోటు చేసుకున్న ఓ ఘ‌ట‌న ఇంట‌ర్నెట్‌లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. ఇక్క‌డ జ‌రిగిన 100 మీట‌ర్ల ప‌రుగు పోటీలో సోమాలియా (Somalia) కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌స్రా అబూక‌ర్ అలీ ప‌రిగెడుతున్న తీరు చూసి అంద‌రూ విస్మ‌యానికి గురయ్యారు. అస‌లు ఆమె క్రీడాకారిణిలా ప్ర‌వ‌ర్తించ‌లేదు స‌రిక‌దా.. అత్యంత నిర్ల‌క్ష్యంతో వ్య‌వ‌హ‌రించింది.

రేస్ మొద‌లు కావ‌డానికి ముందు తోటి క్రీడాకారిణులు పరుగుకు సిద్ధ‌మ‌య్యే భంగిమ‌ల్లో కూర్చోగా.. దానికి కూడా ఆమె తీవ్ర ఇబ్బంది ప‌డింది. విజిల్ వేసి రేసును మొద‌లు పెట్ట‌గానే.. ఏదో ప‌రిగెట్టాలి కాబ‌ట్టి అన్న‌ట్టు ప‌రుగును ప్రారంభించింది. ఆఖ‌రికి 100 మీట‌ర్ల రేసును 20 సెకండ్ల‌లో పూర్తి చేసింది. ఈ పోటీలో విజేత ఈ ప‌రుగును 10 సెకండ్ల‌లో పూర్తి చేసేయ‌డం గ‌మ‌నార్హం.

రేసు ముగించే స‌మ‌యంలో కూడా ట్రాక్‌పై గెంతుతూ నిబంధ‌న‌లు విరుద్ధంగా అలీ ప్ర‌వ‌ర్తించింది. ఈ వీడియోను ఎల్హామ్ గ‌రాడ్ అనే జ‌ర్న‌లిస్టు ఎక్స్ (ట్విట‌ర్‌)లో పోస్ట్ చేశారు. ‘అస‌లు క్రీడాకారిణి ల‌క్ష‌ణాలే లేని అమ్మాయిని అంత‌ర్జాతీయ పోటీల‌కు ఎలా పంపుతారు? సోమాలియా యూత్, స్పోర్ట్స్ మినిస్ట‌ర్ వెంట‌నే రాజీనామా చేయాలి. ఇది ఒక ర‌కంగా మ‌న దేశానికి జ‌రిగిన అవ‌మాన‌మే’ అనే వ్యాఖ్య‌ను జోడించారు. దీనిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో స‌ద‌రు మంత్రి తాజాగా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

నేష‌న‌ల్ ట్రాక్, ఫీల్డ్ ఫెడ‌రేష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ ఖ‌దీజా ఆదేన్ దాహిర్‌ను త‌క్ష‌ణం స‌స్పెండ్ చేస్తున్నామ‌ని తెలిపారు. అస‌లు ఆ క్రీడాకారిణి చైనాలో జ‌రుగుతున్న పోటీల‌కు ఎలా అర్హ‌త సాధించిందో త‌మకు తెలియ‌ద‌ని వెల్ల‌డించారు. ఈ సెల‌క్ష‌న్‌కు బాధ్య‌త వ‌హించిన ఖ‌దీజా ఆదేన్‌కు అలీ మేన‌కోడ‌లు కావ‌డం వ‌ల్ల‌నే ఆమెకు ఈ అవ‌కాశం ల‌భించిద‌ని సోమాలియా మీడియా వార్త‌లు వెలువ‌రించింది.

Exit mobile version