140 భాష‌ల్లో గాన క‌చేరీ.. యూఏఈలో యువ‌తి ఘ‌న‌త‌

ఒక‌టి కాదు.. రెండు కాదు.. ప‌ది కాదు.. ఇర‌వై కాదు.. ఏకంగా 140 భాష‌ల్లో గాన క‌చేరీ చేసి అంద‌రినీ సంభ్ర‌మాశ్చ‌ర్యంలో ముంచెత్తింది

  • Publish Date - January 5, 2024 / 05:43 AM IST

  • గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్‌లో చోటు
  • మంజుశ్రీ పేరిట ఉన్న‌121 భాషల రికార్డు బ్రేక్‌


విధాత‌: ఒక‌టి కాదు.. రెండు కాదు.. ప‌ది కాదు.. ఇర‌వై కాదు.. ఏకంగా 140 భాష‌లు! అది కూడా మాట‌లు మాట్లాడ‌ట‌మో.. రాత‌లు రాయ‌డ‌మో కాదు.. ఏకంగా పాట‌లు ప‌డ‌టం! 140 భాష‌ల్లో గాన క‌చేరీ చేసి అంద‌రినీ సంభ్ర‌మాశ్చ‌ర్యంలో ముంచెత్తింది. యూఏఈలో ఉండే భార‌త సంత‌తికి చెందిన సుచేత స‌తీశ్ అనే యువ‌తి ఈ అరుదైన ఘ‌న‌త సాధించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్‌లో చోటుసంపాదించింది.


పద్దెనిమిదేండ్ల‌ సుచేత సతీశ్‌ ఇటీవల ఒక సంగీత కచేరీలో అత్యధిక భాషల్లో పాడినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పింది. దుబాయ్‌లో తొమ్మిది గంటలపాటు సాగిన ‘కన్సర్ట్ ఫర్ క్లైమేట్’లో ఈ అసాధారణ విజయం సాధించింది. గతంలో మ‌హారాష్ట్రలోని పుణెకు చెందిన‌ గాయని మంజుశ్రీ ఓక్ పేరిట ఉన్న 121 భాషల రికార్డును సుచేత అధిగమించింది.


గతంలో 2021లో 120 భాషల్లో పాడిన సుచేత ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈసారి వాతావరణ మార్పులపై అవగాహన కల్పించేందుకు త‌న పాట‌ల ల‌క్ష్యాన్ని పెంచుకున్న‌ది. దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు జరిగిన ఐక్య రాజ్య‌స‌మితి ప్ర‌త్యేక‌ కార్య‌క్ర‌మంలో సుచేత ఈ ఘ‌న‌త సాధించింది. తాను 145 భాషల్లో పాడగలిగినప్పటికీ, వాతావరణ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే దేశాలకు ప్రాతినిధ్యం వహించేందుకు ప్ర‌తీక‌గా 140 నంబర్‌ను ఎంచుకున్నట్టు సుచేత చెప్పింది.


కేర‌ళ‌లోని క‌న్నూరుకు చెందిన సుచేత త‌ల్లిదండ్రులు యూఏఈలో స్థిర‌ప‌డ్డారు. ఆమె తల్లిదండ్రులు చర్మవ్యాధి నిపుణుడు టీసీ సతీశ్‌, సుమిత అయిలియాత్. నాలుగేండ్ల‌ వయస్సులోనే సుచేత‌కు సంగీతంలో ఉన్న ప్ర‌తిభ‌ను గుర్తించారు. కర్ణాటక, హిందూస్థాన్ సంగీతం రెండింటిలోనూ శిక్షణ ఇప్పించారు. ఆ శిక్షణ సుచేత‌లో దాగిన అసాధారణమైన సంగీత సామర్థ్యాలకు వెలికితీశాయి. పాట‌లు పాడ‌టంలో ప్రపంచ రికార్డులు నెల‌కొల్పిందేందుకు బాట‌లు ప‌రిచాయి.


బహుభాషా గానంలో సుచేత.. తన తండ్రి జపనీస్ స్నేహితుడి నుంచి ప్రేరణ పొందింది. జపనీస్‌తోపాటు అరబిక్, తగలోగ్, భారతీయ గిరిజన భాషలు, ఆఫ్రికన్ భాషల్లో గాన కచేరీలు చేసింది. సంగీతం, భాష పట్ల ఆమెకున్నఅభిరుచి సాంస్కృతిక అడ్డంకులను అధిగమించింది. దుబాయ్‌లో మొదటి సంవత్సరం డిగ్రీ చ‌దువుతున్న సుచేత‌కు వివిధ భాషల్లో పాటలు నేర్చుకునే తన ప్రయత్నాల వల్ల విభిన్న దేశాలకు చెందిన వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశం లభించింది. సంగీతానికి స‌రిహ‌ద్దులు ఉండ‌వ‌ని నిరూపించింది సుచేత‌.

Latest News