Warangal | వలస ‘అభ్యర్ధులకు’ కొత్త పరీక్ష

  • Publish Date - April 10, 2024 / 03:26 PM IST

  • అభ్యర్ధులుగా ఎంపికైనా అవస్థలు

  • కొత్త-పాతల మధ్య భారీ గ్యాప్

 

విధాత ప్రత్యేక ప్రతినిధి: తెల్లారేసరికి పార్టీ మార్చి, ఎంపీ అభ్యర్ధులైన నాయకులు అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. తెరవెనుక మంతనాలు, స్వంత రాజకీయ ప్రయోజనాలు ఆశించి కొత్తగా ఆఫర్ ఇచ్చిన పార్టీలో చేరిన నాయకులకు రకరకాల అవస్థలు ఎదురవుతున్నాయి. పాత నాయకులు దూరం దూరం అంటుండగా కొత్తవారు రాంరాం చెబుతున్నారు. రెండింటి మధ్య వలస నాయకులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. కొద్ది రోజులకైనా కొత్త, పాత నాయకుల మధ్య సయోధ్య సాధ్యమవుతుందా? లేదా? అనే ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.

అడ్డూఅదుపులేని వలసలు

గతంలో ఏదో ఒకరిద్దరు నాయకులు పార్టీ మారి అభ్యర్ధిగా బరిలో నిలిచేవారు. కానీ, రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. చాలా కాలంగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న నాయకులను కాదని ఇతర పార్టీల నుంచి రాత్రికి రాత్రి పార్టీ మారిన వారికి అవకాశం కల్పించి అందలమెక్కించడమొక సంప్రదాయంగా మారింది. ఏ పార్టీలోనైనా ఉండనీ, డబ్బు, పలుకుబడి, కులబలం, ఎన్నికల మేనేజ్ మెంట్ సత్తా ఉన్న వారికి పిలిచి పీట వేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పరిస్థితి మరీ దిగజారిపోయింది.

మూడు ప్రధాన పార్టీలు సుదీర్ఘకాలం తమ పార్టీలో ఉన్న నేతలకిచ్చిన సీట్లకంటే వలస నేతలకు ఎక్కువ స్థానాలిచ్చారు. ఊసరవెల్లి రంగులు మార్చిన కంటే తక్కువ సమయంలో కండువా మార్చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీలు పడుతూ అధికార పార్టీలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా బీజేపీ 17 మంది, బీఆర్ఎస్, 16 స్థానాలకు, కాంగ్రెస్ 14 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది.

జంప్ జిలానీలకు పెద్ద పీట

17 ఎంపీ స్థానాల్లో తొలి నుంచి బీజేపీలో ఉన్న నాయకులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ముందూ వెనుక చేరిన నాయకులు ఎక్కువగా ఉన్నారు. ధర్మపురి అర్వింద్, డికె అరుణ, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు కొంత ముందుగా బీజేపీలో చేరారు. తాజాగా పోతుగంటి భరత్, బీబీపాటిల్, గోడం నగేష్, సైదిరెడ్డి, గోమాస శ్రీనివాస్, అజ్మీరా సీతారాం నాయక్, అరూరి రమేష్ ఉన్నారు. తాండ్ర వినోద్ రావు, మాధవీలత స్వతంత్రులుగా ఉన్నారు. మెజార్టీ అభ్యర్ధులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని బరిలో నిలిపి బీజేపీ తెలంగాణలో బాగా బలపడిందని చెప్పడం విశేషం.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సైతం ఎంపీ అభ్యర్ధుల్లో స్వంత పార్టీ కంటె వలసనేతలకు పీటవేశారు. పట్నం సునీతామహేందర్రెడ్డి, దానం నాగేందర్, గడ్డం రంజిత్ రెడ్డి, నీలం మధు, కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ ఇతర పార్టీలకు చెందినవారుకాగా, స్వతంత్రురాలు ఆత్రం సుగుణ కాంగ్రెస్ లో చేరారు. మొన్నటి వరకు కారు ఓవర్ లోడుగా మారిందనుకున్నా బీఆర్ఎస్ కూడా వలస అభ్యర్ధులను బరిలో నిలిపారు. కాసాని, గాలి అనిల్ కుమార్, ఆర్ ఎస్ ప్రవీణ్, క్యామ మల్లేషం, గడ్డం శ్రీనివాసరెడ్డిలను పోటీపెట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు అటూఇటూగా చేరిన వారితో పాటు ప్రవీణ్ కుమార్ తాజాగా చేరారు.

సమన్వయంలేక సతమతం

వలసనేతలు అభ్యర్ధులుగా మారడంతో నిన్నటి వరకు టికెట్ ఆశించిన ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొత్త అభ్యర్ధికి సహకరించడకుండా కొందరు మౌనం వహిస్తే మరికొందరు గోతులు తీస్తున్నారు. ఇంకొందరు పార్టీ నిర్ణయం పేరుతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీలో చేరిన నేతల అనుచరులు, పాత పార్టీ కేడర్ మధ్య పొసగక గ్రూపులు నెలకొంటున్నాయి. బహిరంగంగా కేడర్ చీలిపోయి వ్యవహరిస్తున్నారు. వలసనేత గెలిస్తే ఆయన అనుచరులకు ప్రాధాన్యత పెరిగి తమకు ఇబ్బందులు తప్పవని కేడర్ సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

అంగబలం, అర్ధబలంతో పార్టీ టికెట్ తెచ్చుకున్న నాయకుల చేతి చమురుగట్టిగానే వదులుతున్నట్లు చెబుతున్నారు. పాత పార్టీలోని ముఖ్యనాయకులు, కేడర్ చిలుము వదిలిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికలు ముగిసేసరికి పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం అభ్యర్ధులను వెంటాడుతోంది. గెలుపు ఆశచూపెట్టి కావాల్సినంత పిండుతున్నట్లు చెబుతున్నారు. కొత్త, పాతలతో పడరాని పాట్లు పడుతున్నామని రెండువైపులా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest News