కీట‌కాల సంఖ్య త‌గ్గుతుండ‌టంతో అంద‌విహీనంగా పువ్వులు.. ఏమిటీ సంబంధం?

వాతావ‌ర‌ణ మార్పులు.. త‌ద్వారా జీవ వైవిధ్యంలో వ‌చ్చే మార్పులు ప్ర‌కృతి అందాన్ని క్ర‌మంగా క్షీణింప‌జేస్తున్నాయి.

  • Publish Date - December 20, 2023 / 10:54 AM IST

విధాత: వాతావ‌ర‌ణ మార్పులు.. త‌ద్వారా జీవ వైవిధ్యంలో వ‌చ్చే మార్పులు ప్ర‌కృతి అందాన్ని క్ర‌మంగా క్షీణింప‌జేస్తున్నాయి. వివిధ జంతుజాలాల మ‌ధ్య ఉండే సంబంధాన్ని క్షీణింప‌జేస్తున్నాయి. తాజాగా కీట‌కాల (Insects) కు, పుష్పాల‌ (Flowers) కు ఉన్న సంబంధంపై అధ్య‌య‌నం (Study) చేసిన ప‌రిశోధ‌కులు షాక్‌కు గుర‌య్యారు. కీట‌కాల సంఖ్య త‌గ్గిపోతుండ‌టంతో పువ్వులు అంత ఆక‌ర్ష‌ణీయంగా ఉండేందుకు ప్ర‌య‌త్నించ‌డం లేద‌ని తెలుసుకున్నారు.


ఈ రెండింటికీ ఉన్న సంబంధం ఏమిట‌నే దానిపై అధ్య‌య‌న క‌ర్త‌ల్లో ఒక‌రైన పియ‌రీ ఓలీవ‌ర్ చెప్టో వివ‌రించారు. ఆయన తెలిపిన ప్ర‌కారం.. ప్ర‌కృతిలో ప్ర‌తి రెండు జీవుల మ‌ధ్య ఒక సంబంధం ఉంటుంది. వాటి వాటి అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఇవి స్నేహాన్ని ఏర్ప‌ర‌చుకుంటాయి. అలాగే కీట‌కాల‌కు, పుష్పాల‌కూ ఒక సంబంధం ఉంది. ఆక‌లి తీర‌డానికి తేనెటీగ‌ల వంటి కీట‌కాల‌కు పువ్వుల్లోని మ‌క‌రందం అవ‌స‌రం. త‌మ సంప‌ర్కానికి కీట‌కాలు పుష్పాల‌కు అవ‌స‌రం.


అలా మ‌క‌రందం కోసం ఒక తేనెటీగ రావాలంటే ఆ పువ్వు చాలా ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాలి. అలా ఉన్న‌ప్పుడు తేనెటీగ ఆక‌ర్షిత‌మై పువ్వు మీద మ‌క‌రందం కోసం వాలుతుంది. అలా పువ్వు తేనెను పీల్చుకునే క్ర‌మంలో తేనెటీగ‌ల వంటి కీట‌కాల కాళ్ల‌కు ప‌రాగ రేణువులు అంటుకుంటాయి. ఇదే క్ర‌మంలో అవి మ‌రో పువ్వుపై తేనె కోసం వాలిన‌పుడు ఈ రేణువులు అక్క‌డి రేణువుల‌తో సంయోగం జ‌రిపి ప‌ళ్లూ ఫ‌లాలు కాస్తాయి. ఇలా కీట‌కాలు రావాలంటే పుష్పాలు ఆక‌ర్షితంగా ఉండాలి. అందుకే ప‌రిణామ క్ర‌మంలో చెట్టు ఎలాంటిదైనా పువ్వులు మాత్రం కంటికి ఇంపుగా ఉంటాయి.


ఇప్పుడు కీట‌కాలే లేక‌పోవ‌డంతో పుష్పాలు కూడా ఈ విధానానికి స్వ‌స్తి చెప్పే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఉదాహ‌ర‌ణ‌కు ప్యారిస్‌కు స‌మీపంలో ఉన్న పూల తోట‌లో.. పుష్పాలు సాధార‌ణం కంటే 10 శాతం త‌క్కువ ప‌రిమాణంలో విక‌సిస్తున్నాయి. అవి ఉత్ప‌త్తి చేసే మ‌క‌రందం కూడా గ‌త 20, 30 ఏళ్ల‌తో పోలిస్తే 20 శాతం త‌గ్గింది. కీట‌కాల విష‌యానికి వ‌స్తే గ‌త 150 ఏళ్ల కాలంలో మొత్తం కీటకాల్లో 10 నుంచి 15 శాతం జాతులు అంత‌రించి పోయాయాని అంచ‌నా. ఈ సంఖ్య 2,50,000 నుంచి 5,00,000 వ‌రకు ఉండొచ్చు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం కూడా ఏటా కీట‌కాల అంత‌రించిపోయే రేటు 2 శాతంగా న‌మోద‌వుతూ వ‌స్తోంది.


మంచినీటి వ‌న‌రుల‌ను భూమి మీద జీవాన్ని క‌లిపి ఉంచే ఒక లింక్‌గా కీట‌క జాతిని సైన్స్ గుర్తిస్తోంది. అయితే వాటి ప‌రిర‌క్ష‌ణ‌పై ప్ర‌భుత్వాలు దృష్టి పెట్ట‌డం లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక అంచనా ప్ర‌కారం. పూవుల మ‌ధ్య సంప‌ర్కంలో కీట‌కాల వాటా 75 శాతం. ప్ర‌పంచంలో సాగ‌వుతున్న పంట‌ల‌కు ఇదే ఆహారం. డ‌బ్బుల్లో చూసుకున్నా ఇవి చేసే ప‌ని విలువ సంవ‌త్స‌రానికి 577 బిలియ‌న్ డాల‌ర్లు ఉంటుంద‌ని సైన్స్ పాల‌సీ ప్లాట్‌ఫాం ఆన్ బ‌యోడైవ‌ర్సిటీ, ఎకోసిస్ట‌మ్ స‌ర్వీసెస్ వెల్ల‌డించింది.

Latest News