Golden ship | కడలిపై కనకపు మేడ.. ప్రపంచంలోనే తొలి ఓడ.. ప్రయాణ ఖర్చు రూ.కోట్లలోనే..!

  • Publish Date - March 11, 2024 / 03:47 AM IST

Golden ship: అది ప్రపంచంలోనే తొలి బంగారు నౌక..! బంగారంతో తాపడం చేసిన నౌక..! అయితే ఈ నౌకలో ప్రయాణం అందరికీ సాధ్యం కాదు. బంగారు నౌక కదా..! బడాబాబులకే ఈ నౌకలో ప్రయాణం సాధ్యం. సామాన్యులు ఈ నౌకలో కాలు కూడా పెట్టలేరు. ఎందుకంటే ఈ నౌకలో ప్రయాణానికి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. ఈ నౌకను ఎవరు తయారు చేశారు..? నౌక యజమాని ఎవరు..? ఇప్పుడు ఆ నౌక ఎక్కడుంది..? దాని ప్రత్యేకతలు ఏమిటి..? అనే సందేహాలు మీ మెదళ్లను తొలుస్తున్నాయి కదా..? ఇక వివరాల్లోకి వెళ్దాం..

ఈ కడలిపై మెరిసే ఈ కనకపు నౌకకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి బంగారునౌక. నౌక బయటి వైపు పూర్తిగా 24 క్యారట్స్‌ బంగారు రేకుతో తాపడం చేశారు. నౌక లోపల గదుల్లోని ఫర్నిచర్‌ హ్యాండిల్స్, నాబ్స్, షాండ్లియర్స్, గ్లాస్‌ ఫ్రేమ్స్‌ లాంటి వాటిని కూడా పూర్తిగా బంగారు తాపడంతో మెరుపులు దిద్దారు. ఆస్ట్రేలియాకు చెందిన ఏకే రాయల్టీ కంపెనీ అధినేత ఆరన్‌ ఫిడ్లర్ ఈ నౌకకు యజమాని‌.

ఈ నౌకలో సిబ్బందితో పాటు మరో 12 మంది అతిథులు విలాసవంతంగా ప్రయాణించవచ్చు. దీనిలో అతిథుల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన డైవింగ్‌ స్కూటర్లు, జెట్‌ స్కీ బోట్లు లాంటివి కూడా పూర్తిగా బంగారు తాపడం చేసినవే. ఈ నౌకలో నాలుగు లగ్జరీ సూట్‌లు, ప్రత్యేక డైనింగ్‌ రూమ్‌లు, బాంకెట్‌ హాల్, స్విమింగ్‌ పూల్, బాక్సింగ్‌ పరికరాలతో కూడిన అధునాతన జిమ్, సినిమా థియేటర్, డీజే బూత్, పబ్‌ తదితర విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి.

ఇన్ని వసతులున్న ఈ నౌక పొడవు ఏకంగా 136 అడుగులు. ఈ నౌకను ఎటు నుంచి చూసినా కళ్లు చెదిరేలా బంగారు ధగధగలే కనిపిస్తాయి. ఏటా వేసవిలో, శీతా కాలంలో ఆ నౌకను ప్రయాణికుల విహారానికి అద్దెకు ఇస్తున్నారు. ఆ నౌకలో ప్రయాణించాలంటే వారానికి లక్ష పౌండ్లు అంటే మన కరెన్సీలో రూ.1.05 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బంగారు నౌక బడాబాబుల విలాసవంతమైన ప్రయాణానికే పరిమితమని చెప్పవచ్చు. 

Latest News