Site icon vidhaatha

Threads App | ట్విట్టర్‌కు పోటీగా మెటా ‘థ్రెడ్స్‌’ యాప్‌..! రేపటి నుంచి అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌..!

Threads App | ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు పోటీగా.. మెటా సంస్థ కొత్త యాప్‌ను తీసుకురాబోతున్నది. కొత్త సోషల్‌ మీడియాకు ‘థ్రెడ్స్‌’గా నామకరణం చేసింది. ఇప్పటికే ఈ యాప్‌ యాపిల్‌ స్టోర్‌లో ప్రత్యక్షమవగా.. గురువారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ట్విట్టర్‌ యాప్‌ తరహాలో ఫీచర్లతో తీసుకురాబోతున్నది. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానంగా ఈ టెక్స్ట్‌ ఆధారంగా యాప్‌ ఉండబోతుందని, కొత్త యాప్‌పై ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులు తమ యూజర్‌ నేమ్‌ కొనసాగించేందుకు అవకాశం ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఖాతాలను సైతం కొత్త యాప్‌లోనూ అనుసరించేందుకు అవకాశం ఉంది.

టెక్ట్స్‌ రూపంలో ఉన్న పోస్టులను సైతం లైక్‌ చేయడంతో పాటు కామెంట్స్‌ చేయడంతో పాటు వాటిని ఇతరులను షేర్‌ చేసుకునే వెసులుబాటు సైతం ఉంటుందని సమాచారం. అయితే, థ్రెడ్స్‌ యాప్‌పై స్పందించేందుకు మెటా నిరాకరించింది. మార్క్‌ జుకర్‌ బర్గ్‌ నేతృత్వంలోని మెటా యాజమాన్యంలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ యాప్స్‌ నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఎలాన్‌ మస్క్‌ గతేడాది 44 బిలియన్‌ డాలర్లకు ట్విట్టర్‌ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్‌ ఇస్తున్నాడు. ట్విట్టర్‌ చేస్తున్న మార్పులు ప్రకటనదార్లు, వినియోగదార్లను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో థ్రెడ్స్‌ యాప్‌ వినియోగదారులను ఆకట్టుకోగలిగితే మస్క్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Exit mobile version