Triplets Guinness Record | ఈ ముగ్గురు కవల పిల్లలు గిన్నిస్ రికార్డు( Guinness Record )సృష్టించారు. 22 వారాల 5 రోజులు మాత్రమే తల్లి గర్భంలో ఉన్నారు. అంటే కేవలం 5 నెలలకే ముగ్గురు కవలలు జన్మించారు. ఆ పిల్లలు జన్మించే మూడు వారాల ముందే తాను గర్భిణి అని తల్లి గ్రహించింది. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌కు చెందిన జాసన్ హాప్‌కిన్స్, మిచేలా దంపతులు 2021, ఫిబ్రవరి 14న ముగ్గురు కవల పిల్లలకు జన్మనిచ్చారు. మిచేలా తన పిల్లలకు జన్మనిచ్చే మూడు వారాల ముందు తాను గర్భిణి అని తెలుసుకుంది. అయితే ఈ ముగ్గురు 5 నెలలకే జన్మించడంతో వారి మొత్తం బరువు కేవలం 1.28 కేజీలు మాత్రమే. 216 రోజుల పాటు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం వీరికి రెండేండ్ల వయసు. నాలుగు నెలల ముందే పుట్టిన ఈ ముగ్గురు అమ్మాయిలు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. ఐదు నెలలకే పుట్టి.. ఆరోగ్యంగా ఉండటం ప్రపంచంలోనే ఇది తొలి కేసు. దీంతో ఈ ముగ్గురు కవలలు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు.
ముగ్గురు కవలల పేర్లు రూబీ రోజ్, పేటాన్ జానే, పోర్స్‌చా మాయే. రూబీ రోజ్ ఉదయం 10:33 గంటలకు జన్మించగా, ఆమె బరువు కేవలం 467 గ్రాములు మాత్రమే. మిగతా ఇద్దరు పిల్లలు కూడా అదే రోజు మధ్యాహ్నం 12:01, 12:02 గంటలకు జన్మించారు. జానే బరువు 402 గ్రాములు కాగా, మాయే బరువు 415 గ్రాములు మాత్రమే. అయితే వీరు జన్మించిన తర్వాత కేవలం 10 సెకండ్లు మాత్రమే శ్వాస తీసుకోగలిగారు. ఆ తర్వాత వైద్య బృందం వారిని ఇంక్యుబేటర్లలో ఉంచి ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడారు.