విధాత : హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బంజార్ వ్యాలీలోని గియాగి ఏరియాలో టూరిస్టులతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాద ఘటనపై కులు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ స్పందించారు. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి 8:30 గంటలకు జరిగిందని తెలిపారు. ప్రమాదం జరిగిన ఆ వాహనంలో డ్రైవర్‌తో కలిపి 17 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
ఇక భారీ వర్షాల కారణంగా ధర్మశాల ఏరియాలో ఆదివారం 83 మంది పర్యాటకులు త్రింద్ హిల్ స్టేషన్‌లో చిక్కుకున్నారు. ఈ పర్యాటకులందరినీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రక్షించింది. వీరిలో ఏ ఒక్కరికి గాయాలు కాలేదు.