విక్టరీ వెంకటేశ్-అనిల్ రావిపూడి.. ఇది సూపర్‌హిట్ కాంబినేషన్. ఎఫ్2,3 లతో కేక పుట్టించారు. ఎఫ్2 అయితే చెప్పక్కర్లేదు. ప్రేక్షకులకు నవ్వలేక కడుపునొప్పి వచ్చిన సినిమా.
ఈమధ్య వెంకీ నుండి వచ్చిన సినిమా సైంధవ్. ఇది పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. భారీ యాక్షన్ సినిమాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ కాలేకపోయింది. కథ, కథనాల బలహీనత కారణంగా సినిమా ఆడలేదు. దాంతో ఆలోచనలో పడ్డ వెంకీమామ తనకు అచ్చొచ్చిన కామెడీనే మరోసారి చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కామెడీ టైమింగ్‌లో కింగ్‌లాంటి వెంకీ, అదే జానర్‌లో, డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమా చేయాలనుకుని, దాన్ని తన హిట్ డైరక్టర్ అనిల్ రావిపూడి చేతిలో పెట్టినట్లు కృష్ణానగర్‌లో ముచ్చట్లు జోరుగా సాగుతున్నాయి. సోషల్‌మీడియాలోనైతే చెప్పక్కర్లేదు.
అయితే అనిల్ దీన్ని డిఫరెంట్‌గా ట్రీట్ చేయబోతున్నారట. పూర్తిగా రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌తో రూపొందించాలనుకుంటున్నట్లు, ఎఫ్ సిరీస్‌తో పోలిక ఉండకూడదనే నిర్ణయంతో ముందుకుసాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ కాంబినేషన్ అనగానే ఒకే నిర్మాత మనకు గుర్తుకువస్తాడు. ఆయనే దిల్ రాజు. ఆ లెక్క ప్రకారం, దీన్ని ఆయనే నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లు ఈ మధ్య దిల్ రాజు ఓ టైటిల్ రిజిస్టర్ చేసారు. గమ్మత్తుగా ఉన్న ఈ పేరు వెంకీ-అనిల్ మూవీ కోసమే అని గుసగుసలు.
సైంధవ్‌తో ఫ్లాప్ మూటగట్టుకున్న వెంకటేశ్‌కు అర్జంట్‌గా ఓ హిట్ కావాలి. భగవంత్ కేసరితో హిట్టు కొట్టిన అనిల్‌కు పేరు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి. సో, ఇద్దరు తమకు కలిసొచ్చే కామెడీకే ఓటు వేసారు. ఇంతకూ ఆ టైటిల్ చెప్పనేలేదు కదూ.. “సంక్రాంతికి వస్తున్నారు”. ఇదే ఇదే టైటిల్. నిజంగా కూడా ఈ సినిమా 2025 సంక్రాంతికి వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నారట. ఎలాగూ శరవేగంగా సినిమా తీయడంలో అనిల్ దిట్ట. కాబట్టి, వీరు గ్యారంటీగా ‘సంక్రాంతికే వస్తారు’.