Site icon vidhaatha

Vijay devarakonda | వంద మందికి సాయం చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అదొక్క‌టే బాధ అంటూ కామెంట్

Vijay devarakonda |

యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ ఇమేజ్ ద‌క్కించుకున్నాడు. వ‌రుస ఫ్లాపులు వ‌చ్చిన కూడా ఆయ‌న క్రేజ్ త‌గ్గ‌లేదు. రీసెంట్‌గా ఖుషి సినిమాతో మంచి విజ‌యాన్ని దక్కించుకు న్నాడు. అయితే ‘ఖుషి’ ప్రచారంలో భాగంగా వైజాగ్ వెళ్లిన విజయ్ దేవరకొండ.. ‘ఖుషి’ సినిమా ద్వారా తనకు వచ్చిన రెమ్యునరేషన్‌లో కోటి రూపాయలను 100 కుటుంబాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించిన విష‌యం తెలిసిందే.

తాను ఇచ్చిన మాట ప్ర‌కారం వంద కుటుంబాల‌ని ఎంపిక చేసి వారికి చెక్ అందించారు. తాను సినిమాలు చేసినంత కాలం ప్ర‌తి ఏడాది ఇలానే ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటానని విజ‌య్ దేవ‌ర‌కొండ స్ప‌ష్టం చేశారు. గ‌తంలో కూడా విజ‌య్ ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం మ‌నం చూశాం.

అయితే స్ప్రెడింగ్ ఖుషి అనే పేరుతో చేప‌ట్టిన ఈవెంట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ.. నేనే చేయాలనుకున్నవి చేయగలుగుతున్నా అంటే ఈ శక్తి, సంపాదన, స్థాయి, ధైర్యం నాకు ఇచ్చినందుకు నా అమ్మానాన్నలకి, తెలుగు ప్రజలకి, నా టీమ్‌కి, ఆ దేవుడికి కృత‌జ్ఞ‌తలు తెలుపుకోవాలి. నేను పెరుగుతున్న స‌మ‌యంలో ఈ కోరిక‌లు నాకు ఉండేవి. ఇప్పుడు వాటిని తీరుస్తున్నాను.

ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు నా స్నేహితులంద‌రు కాలేజ్ ట్రిప్‌కి వెళ్ల‌గా అప్పుడు నేను వెళ్ల‌లేక‌ పోయాను. ఆ పెయిన్ నాకు తెలుసు. అందుకే గతేడాది 100 మంది స్కూలు పిల్లలను వాళ్ల ఫస్ట్ హాలీడేకు పంపించానంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ స్ప‌ష్టం చేశారు. ఇక నా తమ్ముడి ఇంజ‌నీరింగ్ ఫీజు కట్టడానికి ఇంట్లో అమ్మానాన్న పడిన ఒత్తిడి వాళ్లు పడే వేదన నేను చూశాను.

ఆ స‌మ‌యంలో ఎవరైనా ఒక లక్ష రూపాయలు ఇస్తే మనకు హెల్ప్ అవుతుంది క‌దా అని అనుకునే వాడిని. ఈ రోజు మంచి స్థానంలో, మీకు ఫ్యామిలీలా ఉన్నాను కాబ‌ట్టి.. ఇలా అంద‌రికి సాయం చేస్తున్నాను. ఇందుకు ఆనందంగా ఉంది. ఈ చిన్న సాయం మీకు ఎంతో సాయపడుతుందని అనుకుంటున్నాను. నాకు ఎవరూ థాంక్యూలు అవీ చెప్పొద్దు. కేవలం 100 కుటుంబాలకు మాత్రమే సాయం చేయగలుగుతున్నాను.

ఇంకా ఎంతో మందికి చేయాలనే కోరిక నాకు ఉంది. ప్రస్తుతానికి నేను చేయలేను. అయితే దరఖాస్తు చేసుకుని నా సాయం అందుకోలేకపోయిన కుటుంబాలకు మాటిస్తున్నా.. నాకు సంపాదన ఉన్నన్నిరోజులు నేను ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా మీకు సాయం చేస్తూనే ఉంటాను. ప్రతి సంవత్సరం ఇంకొందరి దగ్గరికి చేరుకుంటూ సాయం చేస్తూనే ఉంటాన‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ స్ప‌ష్టం చేశారు. విజ‌య్ చేస్తున్న మంచి ప‌నుల‌కి ప్ర‌తి ఒక్క‌రి నుండి ప్ర‌శంసల వ‌ర్షం కురుస్తుంది.

Exit mobile version