వాట్సాప్‌ స్టోరేజీకి డబ్బులు కట్టాల్సిందే..! గూగుల్‌ ఫ్రీగా ఇచ్చేది ఎంతంటే..?

మోటా యాజమాన్యంలో వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది చివరి నాటికి గూగుల్‌ డ్రైవ్‌ స్టోరేజ్‌ సదుపాయాన్ని తొలగించాలని భావిస్తున్నది

  • Publish Date - January 4, 2024 / 05:02 AM IST

WhatsApp | మోటా యాజమాన్యంలో వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది చివరి నాటికి గూగుల్‌ డ్రైవ్‌ స్టోరేజ్‌ సదుపాయాన్ని తొలగించాలని భావిస్తున్నది. ప్రస్తుతం ఫొటోలు, వీడియోలతో సహా చాటింగ్‌ హిస్టరీని స్టోర్‌ చేసేందుకు గూగుల్‌ డ్రైవ్‌ను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు గూగుల్‌ డ్రైవ్‌ను ఫ్రీగా వాడుకుంటుండగా.. త్వరలోనే డబ్బులు చెల్లించాల్సి రానున్నది. ఇకపై ఫ్రీగా గూగుల్‌ 15 జీబీ స్టోరేజ్‌ పరిమితి మాత్రమే వాట్సాప్‌ వినియోగదారులకు లభించనున్నది. ఆ తర్వాత గూగుల్‌ వన్‌కు సబ్‌ స్క్రైబ్‌ చేసుకోవాల్సి రావొచ్చు.


ఆండ్రాయిడ్ డివైజెస్‌లో వాట్సాప్ బ్యాకప్‌కి త్వరలో గూగుల్ అకౌంట్‌ క్లౌడ్ స్టోరేజ్ పరిమితి విధించబోతున్నారు. ఇతర మొబైల్ ప్లాట్‌ఫామ్స్‌లో వాట్సాప్ బ్యాకప్‌లను ఎలా నిర్వహిస్తారో.. అదే తరహాలో బ్యాకప్‌ మేనేజ్‌మెంట్‌ ఉండనున్నది. ఈ మార్పు గతేడాది డిసెంబర్‌ నుంచి బీటా వినియోగదారులకు.. ఈ ఏడాది నుంచి ఆండ్రాయిడ్‌ యూజర్లందరికీ అందుబాటులోకి రానున్నది. ఈ కొత్త మార్పులు ఈ ఏడాదిలో యూజర్లందరికీ అందుబాటులోకి వస్తాయని వాట్సాప్‌ వెల్లడించింది. వాట్సాప్ సెట్టింగ్‌ చాట్ బ్యాకప్ బ్యానర్‌లో 30 నెలరోజుల ముందుగానే యూజర్లకు తెలియజేస్తామని వాట్సాప్‌ స్పష్టం చేసింది.


వాట్సాప్‌ యూజర్లు 15 జీబీ వరకు ఉచితంగా డేటాను స్టోర్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత బ్యాకప్‌ కోసం గూగుల్‌ వన్‌కు సబ్‌ స్క్రైబ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్లు ఆండ్రాయిడ్‌ డివైజెస్‌లో ఈ డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. వాట్సాప్ చాట్స్‌ గూగుల్‌ అకౌంట్‌లో స్టోర్‌ చేసుకోవడం ఆసక్తి లేకపోతే.. వినియోగదారులు కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడు ట్రాన్స్‌ఫర్‌ ఫీచర్‌ను ఉపయోగించుకునేందుకు వీలుంటుంది. అయితే, గూగుల్‌ వాట్సాప్‌ యూజర్లకు 15 జీబీ స్టోరేజ్‌ ఫ్రీగా అందిస్తుండగా.. ఆపిల్‌ నాన్‌ పేయింగ్‌ యూజర్లకు కేవలం 5జీబీ మాత్రమే స్టోరేజీని వాడుకునే వీలు కల్పిస్తుంది.

Latest News