వాగ్వాదంలో దుశ్చర్య.. జమ్ములో దారుణం..
Woman doctor stabbed to death । వారిద్దరూ స్నేహితులు. ఒక విషయంలో మొదలైన వాగ్వాదం.. తీవ్రస్థాయికి చేరుకుంది.. ఆవేశం పట్టలేక అతడు తన స్నేహితురాలైన మహిళా డాక్టర్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం తాను కూడా పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. జమ్ములో ఈ దారుణం చోటుచేసుకున్నది. పోలీసులు ఐపీసీ 302 సెక్షన్ (Section 302 of IPC) కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విధాత : ఆవేశాలు అనర్థాలకు దారి తీస్తాయంటే ఇదే. క్షణికావేశం.. ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది. అదే క్షణికావేశం.. మరొకరిని ఆత్మహత్యకు పురికొల్పింది. ఈ ఘటన జమ్ములో చోటు చేసుకున్నది. జమ్ములోని తల్లాబ్ టిల్లో(Tallab Tillo)కు చెందిన డాక్టర్ సుమేధ శర్మ(Sumedha Sharma), పంపోష్‌కాలనీలో నివసించే డాక్టర్ జోహార్ మెహమూద్ గనై ( Dr Johar Mehmood Ganai) స్నేహితులని, ఇద్దరూ పరస్పరం ఇష్టపడ్డారని సమాచారం. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమేధ జమ్ములోని ఒక డెంటల్ కాలేజీలో డెంటల్ సర్జరీలో బ్యాచ్‌లర్ కోర్సు Bachelor of Dental Surgery (BDS) చదివింది. ఎండీఎస్ (MDS) చదివేందుకు జమ్ము నుంచి వేరే ప్రాంతానికి వెళ్లింది.
చనిపోతున్నట్టు ఫేస్‌బుక్‌లో పోస్ట్
హోలీ (Holi) పండుగ నేపథ్యంలో మార్చి ఏడున ఇంటికి తిరిగి వచ్చింది. అక్కడి నుంచి తన స్నేహితుడు జొహర్ ఇంటికి వెళ్లింది. అక్కడ వారిద్దరి మధ్య ఏదో విషయంలో ఘర్షణ తలెత్తింది. ఆవేశానికి లోనైన జొహర్.. వంట కత్తితో ఆమెను పొడిచాడు. అనంతరం తనను తాను పొడుచుకున్నాడు. అయితే.. తన వ్యక్తిగత కారణాలతో చనిపోతున్నానని జొహర్ ఫేస్‌బుక్‌లో (Facebook) పోస్ట్ చేశాడు.
ఇది గమనించిన జొహర్ బంధువు ఒకరు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. జమ్ములోని జానీపూర్‌లో ఉన్న జొహర్ ఇంటికి పోలీసులు వెళ్లగా లోపలి నుంచి గడియ పెట్టి ఉన్నది. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా సుమేధ నెత్తుటి మడుగులో ఉన్నది. జొహర్‌కు పొత్తి కడుపులో కత్తిపోట్లు ఉన్నాయి. వెంటనే వారిద్దరినీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే.. సుమేధ చనిపోయింది. జొహర్ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నది. సుమేధ భౌతిక కాయాన్ని పోలీసులు ఆమె బంధువులకు అప్పగించారు.