Yashasvi jaiswal: ఐపీఎల్‌లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్‌కి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం రాగా, ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగ పరచుకున్నాడు. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌పై యువ ఓపెనర్, అరంగేట్ర ప్లేయర్ యశస్వి జైస్వాల్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. అద్వితీయమైన ప్రదర్శనతో డబుల్ సెంచరీ దిశగా సాగుతున్న యశస్వి జైస్వాల్(387 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 171)ని అల్జారీ జోసెఫ్ ఔట్ చేయడంతో ఇన్నింగ్స్‌కి తెరపడింది. తొలి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసే సువర్ణవకాశాన్ని యశస్వి తృటిలో చేజార్చుకోవడం అభిమానులకి ఏ మాత్రం మింగుడుపడడం లేదు.
అయితే రానున్న రోజులలో యశస్వి ఎన్నో రికార్డులు సృష్టిస్తాడు అని అభిమానులు భావిస్తున్నారు. తాజాగా యశస్వికి సంబంధించిన ఓ మీమ్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. యశస్వి అద్భుతమైన ప్రదర్శన కనబరచిన నేపథ్యంలో కొందరు మీమర్స్ యశస్విని, రాజమౌళి తెరకెక్కించిన విక్కమార్కుడు సినిమాలోని బాలనటుడిని పక్కపక్కన పెట్టి తెగ వైరల్ చేస్తున్నారు. యశస్వి అచ్చం ఆ బాలనటుడి మాదిరిగా ఉండడంతో కొందరైతే యశస్వి విక్రమార్కుడు సినిమాలో నటించాడంటూ ప్రచారాలు కూడా చేస్తున్నారు. మొత్తానికి యశస్వి పేరు మాత్రం సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది.
ఇదిలా ఉంటే యశస్వీకి, విక్రమార్కుడు సినిమాలో నటించిన బాల నటుడికి ఏ మాత్రం సంబంధం లేదు. యశస్వీ తండ్రి ముంబయిలో పానీ పూరీ అమ్మేవాడు. దాని నుండి వచ్చిన సంపాదనతోనే కుమారుడిని పెంచాడు.
ఇక తొలి టెస్ట్‌లో అదరగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న యశస్వి జైస్వాల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో కూడా తన అద్భుతమైన ఆటతో క్రికెట్ ఫ్యాన్స్ ను, మాజీ క్రికెటర్లను ఆకర్షించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడిన యశస్వి తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు.
బక్క పల్చగా ఉండే యశస్వి భారీ సిక్సర్లు కొట్టడం చూసి ఆడియెన్స్ అవాక్కయ్యారు. యశస్వికి మంచి భవిష్యత్ ఉందని, అతను మంచి ఇన్నింగ్స్ లు ఆడి టీంతో తన స్థానాన్ని పదిలపరచకోవాలని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. విండీస్‌తో జరిగిన టెస్ట్‌లో యశస్వి.. మరో 29 పరుగులు చేస్తే అరంగేట్ర మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్రలో నిలిచేవాడు. ఒకవేళ మరో 17 పరుగులు చేసి ఉంటే.. భారత్ తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచేవాడు.